తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్… మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతోంది. వారిపై వేటు వేసే అన్నిమార్గాలను అన్వేషిస్తూ న్యాయపోరాటం చేస్తోంది. ఇదిలా ఉంటే…. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు వెంటనే కండువా మార్చేశారు. అయితే వీరిలో కొందరు నేతలు… అధికార కాంగ్రెస్ లో అడ్జెస్ట్ కాలేక… ఘర్ వాపసీ అంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ్నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప… ఓడిపోయారు. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా ఓడిపోగా… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే గత కొద్ది నెలలకే కోనేరు కోనప్ప…. పార్టీ మారిపోయారు. గత ఏడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ లో చేరిన కోనేరు కోనప్ప…. కొద్దిరోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇమడలేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అనుకున్నంత మేర సాకారం లభించలేదు. అంతేకాకుండా పార్టీలోని పరిస్థితులపై ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కూడా కామెంట్స్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారాయి. ఆ తర్వాత కొద్ది నెలలుగా పార్టీతో సంబంధం లేకుండానే రాజకీయాలు చేస్తున్నారు.
కట్ చేస్తే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. తిరిగి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆయన చేరికతో సిర్పూర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్రంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచే పోటీ చేశారు. బీఎస్పీ నుంచి బరిలో నిలవగా… 40 వేలకుపైగా ఓట్లను దక్కించుకున్నారు. అయితే ఇక్కడ్నుంచి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ 3,008 ఓట్లతో విజయం సాధించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలతోనే తాను ఓడిపోయినట్లు కోనేరు కోనప్ప పలుమార్లు చెప్పారు. అంతేకాదు ఎన్నికల కంటే ముందు కూడా కోనేరు కోనప్పపై ఆర్ఎస్పీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత… ఆర్ఎస్పీ బీఎస్పీని వీడారు. అంతేకాదు కేసీఆర్ సమీక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే…. కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో సిర్పూర్ లో ఆర్ఎస్పీకి లైన్ క్లియర్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ్నుంచే పోటీ చేస్తానని కూడా ప్రవీణ్ కుమార్ పదే పదే చెబుతూ వచ్చారు. అయితే తాజాగా కోనేరు కోనప్ప… తిరిగి బీఆర్ఎస్ లో చేరటంతో ఇక్కడ పార్టీ బాధ్యతలను ఎవరు చూస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
కోనేరు కోనప్ప చేరికపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించాల్సి ఉంది. ఇప్పటి వరకైతే ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. కానీ ఎన్నికల సమయం నాటికి పార్టీ ఎవరికి బీ ఫారమ్ ఇస్తుందనేది మాత్రం అత్యంత ఉత్కంఠ రేపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆర్ఎస్పీ ఏమైనా వెనక్కి తగ్గుతారా..? లేక కోనప్పనే అడ్జెస్ట్ అవుతారా..? అనేది కూడా చూడాలి…!
సంబంధిత కథనం