మాజీమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు నాయకత్వం అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన హరీష్ రావు .. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.. ఎన్ని సార్లు అడిగిన ఇదే చెప్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ తమ పార్టీ అధ్యక్షుడని.. ఆయన చెప్పింది తాను తూ.చా. తప్పకుండా పాటిస్తానని హరీష్ వ్యాఖ్యానించారు. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పడు శిరసావహిస్తానని హరీష్ స్పష్టం చేశారు.
హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని.. చాలా ప్రచారం జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని.. సొంతంగా పార్టీ పెడతారని జోరుగా వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ప్రచారం జరిగిన సమయంలో.. ఎన్నికలకు ముందు.. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవీ ఇచ్చినా తాను స్వాగతిస్తానని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రచారం ఆగిపోయింది.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక.. ఈ వార్తలకు కాస్త బ్రేక్ పడింది. అటు కవితను అరెస్టు చేయడంతో రాజకీయం అంతా అటువైపు తిరిగింది. ఇప్పుడు మళ్లీ తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు ఉందని.. కవిత, కేటీఆర్, హరీష్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే కామెంట్స్ వినిపించాయి. హరీష్ తాజా వ్యాఖ్యలతో దీనికి తెరపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం హరీష్ రావు గురించే కాదు.. కవిత గురించి కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. కవిత కొత్త పార్టీ పెట్టబోతోందనే కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో ఈ ప్రచారం బాగా జరిగింది. దీనిపై కవిత ఘాటుగానే స్పందించారు. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ప్రజల కోసమే పోరాటం చేస్తానని.. వారికోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం