Telangana Floods : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం-ex gratia of rs 5 lakh to the families of those who died due to telangana floods ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Floods : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం

Telangana Floods : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం

Basani Shiva Kumar HT Telugu
Sep 02, 2024 01:17 PM IST

Telangana Floods : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి (CMO)

తెలంగాణలో వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు.. రూ.5 లక్షల ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్షాలు, వరద సాయంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం.. రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

కలెక్టర్లకు రూ.5 కోట్లు..

'ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలి. తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ రాయాలి. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలి. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం 5 కోట్లు' ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆగని వర్షాలు.. వరదలు..

మరోవైపు తెలంగాణలో వర్షాలు ఆగలేదు. చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శంకర్‌పల్లిలో మోకిలా విల్లాలను వరద నీరు ముంచెత్తింది. లాపలొమా విల్లాస్‌ నీట మునిగింది. విల్లాల్లోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాంసాగర్‌కు వరద నీరు పోటెత్తింది. ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద వస్తోంది. హుస్సేన్ సాగర్ పుల్ ట్యాంక్ లెవెల్ దాటింది.

ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం..

'ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రాణనష్టాన్ని నివారించగలిగాం. విద్యుత్‌, మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నాం. తెలంగాణలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. అధికారులు 24 గంటలు విధుల్లో ఉండి శ్రమిస్తున్నారు' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

రైళ్లపై ఎఫెక్ట్..

రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్ పడింది. సోమవారం ఉదయం 96 రైళ్లు రద్దు చేశారు. ఆదివారం రాత్రి వరకు 177 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 142 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన అధికారులు పునరుద్ధరిస్తున్నారు. ట్రాక్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.