బీసీ వర్గాల్లో చైతన్యం వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్న ఈటల.. ఉద్యోగులు, నిరుద్యోగులపక్షాన బీజేపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. కొందరు ఓటమి భయంతో సోషల్ మీడియాలో.. బీజేపీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
'కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27వ తారీఖున జరగబోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో.. అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో.. సోషల్ మీడియాలో.. అనేక రకాల విషప్రచారాలు చేస్తున్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు చాలా విజ్ఞులు. అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, ఫేక్ వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఈటల వ్యాఖ్యానించారు.
'ధీరుడు ఎప్పుడు బరిగేసి కొట్లాడుతాడు. కుట్రదారులు, గెలవలేనివారు, సత్తా లేనివారు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వారు మాత్రమే ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజి రెడ్డిని, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్యను గెలిపించాలని గత నెల రోజులుగా బీజేపీ ప్రచారం చేస్తుంది. పార్టీ యంత్రాంగం, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ వ్యవస్థ అందరూ సీరియస్‌గా ఇన్వాల్వ్ అయ్యారు. సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు' అని రాజేందర్ వివరించారు.
'మమ్మల్ని చూసి ఓర్వలేక, తట్టుకోలేక, ఎట్లైనా చేసి ఓడగొట్టాలని ప్రయత్నంలో చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారని.. నాయకులను కించపరిచారని విష ప్రచారం చేస్తున్నారు. మోదీ నాయకత్వంలో 2024- 25లో రూ.4 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి.. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్తుంది. అబద్ధాలాడి కాలం గడుపుతుంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది' అని ఈటల విమర్శించారు.
'టీచర్లకు సంబంధించి 317జీవోను, జరిగిన అవకతవకలను సవరిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇంతవరకు సవరించలేదు. ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా 15 నెలలుగా అందడం లేదు. చివరికి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోసం చేసిన పార్టీకి ఓటు వేద్దామా? పోరాటం చేయగలిగిన సత్తా ఉన్న బీజేపీకి ఓటు వేద్దామా ఆలోచించండి' అని ఈటల విజ్ఞప్తి చేశారు.