BJP Eetala Rajender: పేదల ఇళ్ల స్థలాల వివాదం నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప చెళ్లుమనిపించిన ఈటల రాజేందర్..
BJP Eetala Rajender: భూవివాదాల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు బీజేపీ నేత ఈటల రాజేందర్. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పోచారం మునిసిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రోకర్లతో కుమ్మక్కైన అధికారులు స్థానికుల్ని వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు.
BJP Eetala Rajender: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో అక్కడకు వెళ్లిన భూ వివాదాలకు కారణమవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు కుమ్మక్కై పేదల్ని వేధిస్తున్నారని ఆరోపించారు.
30-40ఏళ్ల క్రితం పైసపైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోకుండా స్థలాలు ఉంచుకున్న వారిని నకిలీ పత్రాలతో వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. హైదరాబాద్ అరుంధతి నగర్, బాలాజీ నగర్, జవహర్ నగర్‌లలో కూడా ఇలాగే చేశారని, 40 గజాలు, 60గజాల స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే వాటిని కూలగొడుతున్నారని మండిపడ్డారు.
రెవిన్యూ మంత్రి, కలెక్టర్, సీపీతో కూడా మాట్లాడానని ఆర్నెల్ల నుంచి నిత్యం కూల్చివేతల బాధలు వినిపిస్తున్నాయని, తమ ఇళ్లు కూలుస్తున్నారని, జాగాలు లాక్కుంటున్నారని, తమ స్థలాల్లో మద్యం సేవిస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారని ఈటల చెప్పారు. మంగళవారం ఏకశిలా నగర్‌లో స్థానికులు రియల్ వ్యాపారిని చుట్టుముట్టిన సమయంలో ఈటల అక్కడకు చేరుకున్నారు. వ్యాపారిపై ఫిర్యాదు చేయడంతో ఆవేశానికి గురైన ఈటల అతని చెంప చెళ్లుమనిపించారు.
ఏకశిలా నగర్‌లో ఖాళీగా ఉన్న 149 ఎకరాల స్థలాలను గతంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్థలాలు పొందిన వారిలో కొందరు వాటిని ఇతరులకు విక్రయించుకున్నారు. కొందరు ఇళ్లు కట్టుకున్నారు. ఈ క్రమంలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలాలకు పత్రాలను సృష్టించి స్థానికులను భయ భ్రాంతులకు గురి చేస్తుండటంతో సమాచారం అందుకున్న ఈటల అక్కడకు చేరుకున్నారు.
స్థానికులు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఫిర్యాదు చేయడంతో ఆవేశానికి గురైన ఈటల అతని చెంప చెళ్లుమనిపించారు. ఆ వెంటనే ఈటల అనుచరులు అతనిపై దాడి చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.