Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డిని దించడానికి 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు - ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని… మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని వ్యాఖ్యానించారు. ఇది సర్కార్ కూలిపోడానికి మొదటి సంకేతమన్నారు.
100 సీట్లలో గెలుస్తాం - ఎర్రబెల్లి
ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితికి వచ్చిందని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. రాహుల్ గాంధీ కూడా టైమ్ ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలన గురించి తెలిసే రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దైందని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలమయమని… స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ను ఓడించి తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నారని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
“ప్రతీ ఒక్క కార్యకర్త ధైరంగా ముందుకు వెళ్ళాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనదే విజయం. ఎవ్వరూ భయపడకండి మీకు ఏ కష్టం వచ్చిన నేనున్నా. ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదు. కనీసం సాగు నీళ్లు అందియలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కర్కాల బ్రిడ్జి ఎందుకు ఆగిపోయింది…? తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి ఎటు పోయింది? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషియాన్ కిట్టు ఎటు పోయింది? మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అబద్ధాలతోనే కాలం వెలదీస్తుంది” అని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 14 నెలల్లో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఎర్రబెల్లి ఆరోపించారు. కాంగ్రెస్ కుప్పకూలిపోతోందని… ఒక్క పని కూడా చేయడం లేదన్నారు. సర్పంచ్‌లకు బిల్లులు విడుదల చేయడం లేదని.. వాటిని ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం