Hydra: హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు.. అక్రమార్కుల గుండెల్లో గుబులు..!
Hydra: హైదరాబాద్, నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రా దూకుడుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. తాజాగా గండిపేట ఏరియాలో అక్రమంగా కట్టిన భవనాలను హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం కూల్చివేసింది. హైడ్రా చర్యలపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ సరస్సు, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ భవనాలను హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం కూల్చివేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కూల్చివేతలు చేపట్టింది. సరస్సును ఆక్రమించి నిర్మించిన అపార్ట్‌మెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు కూల్చివేశాయి. ఇటు హైడ్రా చర్యలను, కూల్చివేతలను నగర వాసులు స్వాగతిస్తున్నారు. తమకు తెలిసిన అక్రమ కట్టడాలు, ఆక్రమణల గురించి హైడ్రాకు తెలియజేస్తున్నారు.
హైడ్రా అంటే ఏంటీ..
హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇటీవలే ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థగా రేవంత్ సర్కారు దీన్ని ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ తోపాటు హైదరాబాద్ నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకోవడమే హైడ్రా ప్రధాన విధి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటుపై మొదట్లో విమర్శలు వచ్చినా.. ఆ తర్వాత ప్రజలు స్వాగతిస్తున్నారు.
హైడ్రాకు ఎన్నో సవాళ్లు..
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిల్లో కొన్నింటిని గుర్తించి ప్రభుత్వం స్వాధినం చేసుకుంది. అయితే.. తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు హైడ్రా తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే బహిరంగంగానే హైడ్రాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టాడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు వాటిని కూల్చివేయడం వీరికి మింగుడు పడటం లేదు.
ఏవీ రంగనాథ్‌తో అంత ఈజీ కాదు..
ప్రస్తుతం హైడ్రా కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. గతంలో ఈయన వరంగల్ సీపీగా, హైదరాబాద్ వివిధ హోదాల్లో పని చేశారు. ఏవీ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ సీపీగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు. ఇప్పుడు కూడా ఆయనపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైంది. కానీ.. రంగనాథ్ వాటిని లెక్క చేయకుండా అక్రమార్కుల భరతం పడుతున్నారు. రంగనాథ్ గురించి తెలిసే రేవంత్ రెడ్డి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.