ED Focus on MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రంగంలోకి ఈడీ !-enforcement focus on mlas poaching case in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Enforcement Focus On Mlas Poaching Case In Telangana

ED Focus on MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రంగంలోకి ఈడీ !

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 04:51 PM IST

ED Focus on MLAs Poaching Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కోణంలో విచారణ చేస్తోంది. ఇప్పటికే రోహిత్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు.. మరికొందరినీ విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఈడీ నజర్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఈడీ నజర్

ED Focus on MLAs Poaching Case : డ్రగ్స్, కేసినో, నేతలు - వ్యాపారుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో ఇప్పటి వరకు తెలంగాణలో పలువురుని విచారించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్... రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై దృష్టి సారించింది. ఈ కేసుకి సంబంధించి మోయినాబాద్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా... ఈడీ తన ప్రాథమిక నివేదికను డిసెంబర్ 15న నమోదు చేసింది. ఈ మేరకు ఇప్పటికే విచారణ ప్రారంభించింది. కేసులో కీలకమైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఇప్పటికే రెండో రోజులపాటు విచారించింది. మొదటి రోజు వ్యక్తిగత వివరాలు సేకరించిన అధికారులు.. రెండో రోజు అనూహ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారిస్తున్నామని చెప్పి.. రోహిత్ రెడ్డికి షాక్ ఇచ్చారు. సుమారు 8 గంటల పాటు పలు ప్రశ్నలు వేసి.. అనేక అంశాలపై వివరాలు సేకరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులతో పరిచయాలు, నగదు వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడిగినట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

గురువారం ఈడీ అధికారులు... రోహిత్ రెడ్డికి వ్యాపార భాగస్వామిగా భావిస్తున్న మాణిక్ చంద్ గుట్కా సంస్థ డైరెక్టర్ అభిషేక్ ఆవులను విచారిస్తున్నారు. 2015 నుంచి ఉన్న సంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలు, వ్యక్తిగత, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. అభిషేక్ కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ-2 గా ఉన్న నందకుమార్ పై ఫిర్యాదు చేశారు. నందు వల్ల కోట్ల రూపాయలు నష్ట పోయానని పేర్కొన్నారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే 50 శాతం వాటా ఇస్తానని నమ్మించడంతో రూ. కోటి పెట్టుబడి పెట్టానని తెలిపారు. నందుకు రూ. 40 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి స్నేహితులకి రూ. 60 లక్షల వరకు బదిలీ చేశానన్నారు. ఇదంతా 2019లో జరిగిందని వివరించారు. 2019, 2020లో నందకుమార్, అభిషేక్ మధ్య కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయన్న సమాచారంతో... ఈడీ అభిషేక్ ను విచారిస్తోంది. పెద్ద మొత్తంలో నగదు బదిలీ వెనుక మనీలాండరింగ్ జరిగిందా లేదా అన్న అంశాలపై ఆరా తీస్తోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బెయిల్ పొంది... ఇతర కేసుల్లో చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ని కూడా విచారించాలని ఈడీ నిర్ణయించింది. నందకుమార్ పై ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుకి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్.. మరియు బంజారాహిల్స్ లో చీటింగ్ కేసులో నమోదైన ప్రాథమిక దర్యాప్తు నివేదికల ఆధారంగా.... కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేసింది.. ఈడీ. ఈ మేరకు నందకుమార్ ని విచారించేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్ర పై నందకుమార్ ను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి నగదు ప్రస్తావన వచ్చినందున.. ఈ అంశంపైనా ఆరా తీసే అవకాశం ఉంది. మరోవైపు.. ఇదే కేసులో ఏ1, ఏ2 గా ఉన్న స్వామీజీలు.. రామచంద్రభారతి, సింహయాజిలను విచారించేందుకు త్వరలో ఈడీ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. మొత్తంగా... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఓ వైపు సిట్, మరో వైపు ఈడీ విచారణ .. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరోవైపు... అక్రమ కేసులు పెట్టి పోలీసులు తనను వేధిస్తున్నారంటూ.. నందకుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. తన క్లయింట్ పై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని... పదే పదే పీటీ వారెంట్ అడుగుతున్నారని నందకుమార్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఇలా వ్యవహరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో... నందకుమార్ పై ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించిన హైకోర్టు... అన్ని కేసులు కలిపి విచారించారని పోలీసులని ఆదేశించింది.

IPL_Entry_Point