Chhattisgarh Encounter: చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్‌లో వరంగల్ జిల్లాకు చెందిన అంకేశ్వరపు సారయ్య ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు పార్టీలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉద్యమ బాటలోనే నడిచిన సారయ్య ఎన్ కౌంటర్ లో మరణించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. ఓరుగల్లు ఉద్యమాల చరిత్రలో కీలకంగా చెప్పుకునే అంకేశ్వరపు సారయ్య మరణంతో తరాలపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన అంకేశ్వరపు వెంకటయ్య, ఎల్లమ్మ దంపతులకు 1968 లో సారయ్య(57) జన్మించాడు. వెంకటయ్య రైల్వే కార్మికుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఎల్లమ్మ, వెంకటయ్య కాలం చేశారు. అంకేశ్వరపు సారయ్య 1982-83 లో తరాలపల్లి సమీపంలోని కొండపర్తీ గ్రామంలో పదో తరగతి వరకు చదివాడు. బడి చదువుల వయసులోనే అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు.
ఈ క్రమంలో దళ సభ్యులతో సంబంధాలు నెరపుతున్నాడన్న కారణంతో సారయ్యను అప్పట్లోనే సంవత్సరం పాటు జైలులో బంధించారు. వరంగల్ సెంట్రల్ జైలులో ఏడాది పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. 1986లో బయటకు వచ్చాక వ్యవసాయ కూలీ సంఘంలో చేరాడు. ఆ తరువాత 1991లో అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
దాదాపు 35 ఏళ్లపాటు ఉద్యమాలు కొనసాగించిన సారయ్య దళంలో అంచెలంచెలుగా ఎదిగాడు. దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి.. పార్టీలో కీలకంగా మారాడు. అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళీ ఇలా తదితర పేర్లతో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సేవలు అందించాడు. కాగా పార్టీలో ముఖ్యమైన స్థానం కావడం, వివిధ కీలకమైన ఘటనల్లో ఆయన నిందితుడిగా ఉండటంతో ఆయనపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఆయనకు ఇద్దరు బాడీ గార్డ్స్ ఉండగా.. వారు కూడా ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.
అంకేశ్వరపు సారయ్య తండ్రి వెంకటయ్య నాలుగేళ్ల క్రితం మరణించగా, తల్లి ఎల్లమ్మ మూడేళ్ల కిందట కనుమూసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. మొదటి నుంచీ గ్రామంలో సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు కూలీలకు పనికి తగిన కూలీ అందించాలంటూ సారయ్య పోరాడుతూ స్థానికుల్లోనూ చైతన్యం రగిలించాడు.
భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి దున్నే వాడిదే భూమి అంటూ ఉద్యమాలు నెరిపాడు. చిన్న వయసులోనే ఉద్యమాల్లోకి వెళ్లిన ఆయన.. చనిపోయేంత వరకు గ్రామం వైపు రాలేదు. ఉద్యమాల కోసం చనిపోయే వరకు కూడా ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్టు తెలుస్తుండగా.. గ్రామంలో ఎన్నో ఉద్యమాలు చేసి, దళంలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు సేవలందించిన సారయ్య మరణ వార్తతో తరాలపల్లిలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఎన్ కౌంటర్ అనంతరం ఛత్తీస్ గడ్ పోలీసులు వరంగల్ కమిషనరేట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం వరంగల్ పోలీసులు తరాలపల్లికి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బుధవారం సారయ్య సంబంధీకులను ఛత్తీస్ గడ్ తీసుకెళ్లి మృతదేహాన్ని అప్పగించనున్నారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం తరాలపల్లిలో సారయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పోరు సలిపిన సారయ్య అస్తమయంతో ఉద్యమంలో ఒక శకం ముగిసినట్లయ్యింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం