TGSRTC : సజ్జనార్‌ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారు.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంచలన ఆరోపణలు!-employees union makes sensational allegations against rtc md sajjanar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc : సజ్జనార్‌ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారు.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంచలన ఆరోపణలు!

TGSRTC : సజ్జనార్‌ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారు.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంచలన ఆరోపణలు!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 09, 2025 11:33 AM IST

TGSRTC : ఇటీవల ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. తమ హక్కుల సాధనకు నోటీసు ఇచ్చినట్టు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు. అటు కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్ సంచలన ఆరోపణలు చేసింది.

సజ్జనార్‌
సజ్జనార్‌

సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా వచ్చినప్పటి నుంచి కార్మికులు, ట్రేడ్‌ యూనియన్ల హక్కుల్ని కాలరాస్తున్నారని.. ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆరోపించింది. ఆర్టీసీలో ప్రస్తుతం నెలకొన్న అశాంతికి సజ్జనారే కారణమని విమర్శించింది. కార్మిక సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి ప్రధాన కారణం సజ్జనార్‌ వైఖరే అని ఈయూ అధ్యక్షుడు ఎస్‌.బాబు స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి రెండు వారాలైనా ఆయన చర్చలకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

పక్కదారి పట్టించారు..

'నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో లక్షల రూపాయల జీతాలతో కన్సల్టెంట్లను నియమించారు. 2017 వేతన సవరణలో యూనియన్ల ప్రమేయం లేకుండా చేశారు. బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. కార్మిక సంఘాల విషయంలో గత ప్రభుత్వాన్ని, ప్రస్తుత సర్కారును పక్కదారి పట్టించారు' అని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాబు శనివారం ఆరోపించారు.

చర్చలకు ఆహ్వానం..

ఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీస్‌ ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజుల తర్వాత కార్మిక శాఖ సమ్మె నోటీసుపై స్పందించి, చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలకు జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.

15 డిమాండ్లు..

1.ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలి.

2.కార్మికులపై పనిభారం తగ్గించాలి.

3.డిపోల పరిధిలో కార్మిక సంఘాల కార్యక్రమాలను అనుమతించాలి.

4.ఎస్ఆర్ బీఎస్, ఎస్బీటీలను రద్దు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.

5.పీఎఫ్, సీసీఎస్‌ వడ్డీ సహా డబ్బు చెల్లించాలి.

6.స్వచ్ఛంద ఉద్యోగ విరమణను ఉపసంహరించుకోవాలి. డిపోల మూసివేతను ఉపసంహరించుకోవాలి.

7.కొత్త బస్సులు కొనుగోలు చేయాలి.

8.టికెట్ తీసుకోకుంటే ప్రయాణికుడినే బాధ్యుడిని చేయాలి.

9.2017, 2021 వేతన సవరణ చేయాలి.

10.2019 నుంచి రావాల్సిన డీఏలు చెల్లించాలి.

11.2019లో సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులు ఎత్తివేయాలి.

12.ఉద్యోగ విరమణ చేసిన వారికి సెటిల్మెంట్లు చెల్లించాలి.

13.అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి.. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి.

14.పాత రెగ్యులేషన్స్ సమూలంగా మార్చి.. డ్రైవర్, కండక్టర్, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి.

15.మృతిచెందిన ఉద్యోగులు, మెడికల్ అన్‌ఫిట్ అయిన వారి స్థానంలో.. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.

Whats_app_banner