Emblem of Telangana: ఉద్యోగి కొంపముంచిన ఫ్లెక్సీ.. అందుకే జాగ్రత్తగా ఉండాలి!-employee suspended for printing unapproved emblem of telangana in flexi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Emblem Of Telangana: ఉద్యోగి కొంపముంచిన ఫ్లెక్సీ.. అందుకే జాగ్రత్తగా ఉండాలి!

Emblem of Telangana: ఉద్యోగి కొంపముంచిన ఫ్లెక్సీ.. అందుకే జాగ్రత్తగా ఉండాలి!

Emblem of Telangana: వరంగల్ జిల్లాలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారిపై వేటు పడింది. ఆమెదించని రాజముద్రతో ఫ్లెక్సీ వేయించిన ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు వరంగల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

వరంగల్‌లో మున్సిపల్ అధికారులు ఇటీవల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా తెలంగాణ రాజముద్రనే మార్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి.. ఇంకా ఆమోదించని రాజముద్రతో ఫ్లెక్సీ ప్రింట్ చేయించారు. అనధికార లే అవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) హెల్ప్‌డెస్క్‌ ప్రచారం కోసం.. వరంగల్‌ నగరపాలక సంస్థ అధికారులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో ఇంకా ఆమోదించని రాజముద్ర ముద్రించారు. ఇది వివాదానికి దారి తీసింది.

కేటీఆర్ ట్వీట్‌తో..

ఈ ఇష్యూపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేసి సీఎస్‌కు ట్యాగ్‌ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎస్ శాంతికుమారి బుధవారం వరంగల్ కమిషనర్‌ అశ్వినీ తానాజీ వాకడేతో మాట్లాడారు. ఆమోదించని రాజముద్రను ఫ్లెక్సీలో వేయించినందుకు.. పట్టణ ప్రణాళిక విభాగం సూపరింటెండెంట్‌ జీవన్‌రావును సస్పెండ్‌ చేశారు. ఇంఛార్జ్ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడ్డేకర్‌కు మెమో ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు వరంగల్‌లో చర్చనీయాంశంగా మారింది.

మార్పులు చేయాలని..

తెలంగాణ ఏర్పడిన కొత్తలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ కళాతోరణం.. ఛార్మినార్‌లతో కూడిన రాజముద్రను రూపొందించగా.. అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మే నెలలో చిత్ర కారుడు రుద్ర రాజేశంతో చర్చించి మార్పులు, చేర్పులపై కసరత్తు చేశారు. ఇటీవల జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోగోను రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ.. వివిధ కారణాల నేపథ్యంలో రాజముద్ర ఆవిష్కరణను వాయిదా వేశారు.

తుది రూపు..

రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులతో సమావేశమై.. అధికార చిహ్నంపై రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చలు జరిపారు. 1969లో తొలి దశ ఉద్యమం జరగ్గా.. ఆనాటి ఆనవాళ్లు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అధికార చిహ్నం ఉండాలని తీర్మానించారు. రాజముద్రలో మార్పులు, చేర్పులపై చిత్ర కారుడు రుద్ర రాజేశంతో చర్చించి.. తుది రూపు తీసుకొచ్చారు.

బీఆర్ఎస్ ఆందోళనలు..

జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అధికారిక చిహ్నాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. లోగో మార్పుపై బీఆర్ఎస్ నేతల అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార చిహ్నం నుంచి ఛార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై ఆందోళనలు కూడా నిర్వహించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.