TG Electric Bike : కొని 40 రోజులు కాలేదు.. అప్పుడే పేలిన ఎలక్ట్రిక్ బైక్.. డిక్కీలో 2 లక్షలు!-electric bike explodes less than 40 days after purchase in jagtial ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Electric Bike : కొని 40 రోజులు కాలేదు.. అప్పుడే పేలిన ఎలక్ట్రిక్ బైక్.. డిక్కీలో 2 లక్షలు!

TG Electric Bike : కొని 40 రోజులు కాలేదు.. అప్పుడే పేలిన ఎలక్ట్రిక్ బైక్.. డిక్కీలో 2 లక్షలు!

Basani Shiva Kumar HT Telugu
Nov 21, 2024 05:57 PM IST

TG Electric Bike : ఓవైపు కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ బైక్‌లు కొన్న కొద్ది రోజుల్లోనే పేలిపోతున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. జగిత్యాల జిల్లాలో ఓ ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన బైక్ పేలిపోయింది.

పేలిన ఎలక్ట్రిక్ బైక్
పేలిన ఎలక్ట్రిక్ బైక్

జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామంలో బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. ఈ ఘటన జరిగింది. 30 శాతం ఉన్నా.. ఛార్జింగ్ పెట్టామని బాధితులు చెబుతున్నారు. ఛార్జింగ్ పెట్టిన కేవలం ఐదు నిమిషాలలోనే బైక్ పేలిపోయింది. కొనుగోలు చేసి 40 రోజులు కాకముందే బైక్ పేలడంపై బాధితుడు బెతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ డిక్కీలోనే వరి ధాన్యం డబ్బులు సుమారు రూ.1.90 లక్షలు ఉన్నట్టు బాధితుడు తిరుపతి రెడ్డి వాపోయారు.

తెలంగాణ ప్రజలు ఈవీ వాహనాలను వినియోగించాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.

'తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి.. ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చాం. గతంలో 2020- 2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

'కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలని ప్రణాళికలు తెచ్చాం. ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ,2 వీలర్స్, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికిల్, ట్రై గూడ్స్ వెహికిల్స్‌కు టాక్స్ మినహాయింపు ఉంది. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో.. ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడుతున్నారు' అని మంత్రి పొన్నం వివరించారు.

'తెలంగాణలో ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలి. ఈవీ వాహనాలకు సంబంధించి గతంలో 5 వేల వెహికిల్స్‌కే టాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వస్తున్నాయి. వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తాం' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

Whats_app_banner