TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలహాలం... పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు-election of mlc of graduates in north telangana is uproar leaders are showing interest in the contest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలహాలం... పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు

TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలహాలం... పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు

HT Telugu Desk HT Telugu
Sep 20, 2024 05:56 AM IST

TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ఎవరికి వారే ఓటర్ నమోదు ప్రక్రియతో మద్దతు కూడగట్టుకుంటున్నారు. క్లియరెన్స్ కోసం చూడకుండా ప్రచారం చేపట్టారు.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్ర పోటీ
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్ర పోటీ

TG Mlc Election: ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వచ్చే ఫిబ్రవరిలో ఖాళీ అవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి ఉన్నారు. బిఆర్ఎస్ హవా కొనసాగిన సమయంలోనే కాంగ్రెస్ కు చెందిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందడంతో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు బోలెడు మంది ఆసక్తి చూపుతున్నారు.

నాలుగు ఉమ్మడి జిల్లాలతో ముడిపడి ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే వారి సంఖ్య ఈసారి సెంచరీ దాటనుంది. పోటీకి ఆసక్తి చూపుతున్న వారు ఓటర్ నమోదు ప్రక్రియతో ప్రచారాన్ని చేపట్టారు. ఎలక్షన్ కమిషన్ అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తుండగా ఆశావాహులు ఇప్పటికే ఎన్రోల్మెంట్ ప్రక్రియను చేపట్టి మద్దతు కూడగట్టుకుంటున్నారు.‌

అధికార కాంగ్రెస్ పార్టీ తోపాటు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ తమకు వేదిక అవుతుందని, టికెట్ రాకపోయినా బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. మున్ముందు ఈ పోటీ అన్ని పార్టీల్లో పెరిగి స్వతంత్రుల సంఖ్య పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, రాజేందర్ రావు...

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కాంగ్రెస్ కష్టకాలంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన పోటీకి ఆసక్తి చూపడం లేదు.‌ దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు‌ ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.

ప్రస్తుతం కరీంనగర్ కు చెందిన ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇటీవల ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నరేందర్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ విద్యాసంస్థల ఉద్యోగులతో సమావేశమై ఓటు నమోదు ప్రక్రియ ముమ్మరం చేశారు. టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ ఉంటానని స్పష్టం చేశారు.

ఉత్తర తెలంగాణలో తన విద్యాసంస్థలు, తనకున్న పరిచయాలతో గ్రాడ్యుయేట్ల వివరాలు ఎన్రోల్మెంట్ కోసం సేకరిస్తున్నారు. వెలిచాల రాజేందర్ రావు ఎంపీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తు సిరిసిల్ల చేనేతకు ప్రభుత్వ బ్రాండింగ్, ట్రేడింగ్లో శిక్షణ, గ్రాడ్యేయేట్లకు మేనిఫెస్టోలతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్సీగా పార్టీ అవకాశమిస్తే పోటీ చేస్తానని తెలిపారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఎవరికి టికెట్ ఇచ్చినా బలపరుస్తానని స్పష్టం చేస్తున్నారు.

సర్దార్ కు దక్కేనా కారు టికెట్?

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ బీఎన్ రావు, ట్రస్మా ప్రతినిధి యాదగిరి శేఖర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ సైతం టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేసిఆర్ ను రవీందర్ సింగ్ కలిసి అభయం కూడా తీసుకున్నారు.

అయితే ఎవరికి వారే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసిన రవీందర్ సింగ్ మేయర్ గా సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ గా అందించిన సేవలు, ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు చేసిన సేవల ఆధారంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు.

కమల దళంలో పోటీ...

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి పోటీకి ఆసక్తి చూపే వారి సంఖ్య కూడా బాగానే ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎంపీలుగా బిజేపికి చెందిన వారే ఉండడంతో ఎమ్మెల్సీ గా గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నుంచి టికెట్ రేస్ లో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బిజెపి అధికార ప్రతినిధి రాణిరుద్రమ, బిజేపి కిసాన్ సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీలో సీనియర్ నేత అయిన తనకు ఇటీవల అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో అవకాశం దక్కలేదని ఈసారి ఎలాగైనా తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సిందేనని సుగుణాకర్ రావు పట్టుబడుతున్నారు.

రాణీరుద్రమకు సిరిసిల్ల నుంచి అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈసారి తమకు ఇవ్వాల్సిందేని సుగుణాకర్రావు వర్గం వాదిస్తోంది. మరోవైపు రాణీరుద్రమ మాత్రం కేంద్రమంత్రి బండి సంజయ్ ని నమ్ముకుని టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఎంపీ తరపున ఒకరు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుండడంతో అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగానే మారనుంది.

అదిష్టానం మదిలో ఏముందో...

మూడు ప్రధాన పార్టీల నుంచే కాకుండా పార్టీ టికెట్ దక్కకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలి... అధిష్టానం ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో ఎవరి అంతుచిక్కడం లేదు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు.

ఎన్నికల్లో మరో నాలుగు నెలల తరువాత జరగనున్న నేపథ్యంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం అవసరమా? అన్న భావనతో పార్టీ ముఖ్యనేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన తరువాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించే యోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్లు సమాచారం.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)