స్థానిక ఎన్నికలకు బ్రేక్ - నోటిఫికేషన్‌ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన-election commission stops notification of local bodies election in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  స్థానిక ఎన్నికలకు బ్రేక్ - నోటిఫికేషన్‌ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన

స్థానిక ఎన్నికలకు బ్రేక్ - నోటిఫికేషన్‌ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రకటన చేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

స్థానిక ఎన్నికలపై ఈసీ ప్రకటన

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ అమలు, నామినేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.తదుపరి నోటిఫికేషన్‌ ఇచ్చేవరకు ఎన్నికల ప్రక్రియలన్నీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగిపోయినట్లు అయింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో MPTC, ZPTC ఎన్నికల గెజిట్‌ నిలిచిపోయినట్లు అయింది. దీంతో సెప్టెంబర్‌ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌ సస్పెండ్‌ అయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయగా.. త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

హైకోర్టు స్టే…

బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీవో 9తో పాటు నోటిఫికేషన్ పై కూడా కోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది.

ఇక హైకోర్టు ఇచ్చిన స్టే ను సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఏమైనా ఆశ్రయిస్తుందా అనే చర్చ కూడా ఉంది. లేకపోతే పాత రిజర్వేషన్ల మాదిరిగానే ముందుకెళ్తుందా..? ఇలా కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పలువురు మంత్రులు మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం