Attack With Snake: హైదరాబాద్‌లో మద్యం మత్తులో బస్సు అద్దాలు పగులగొట్టి, కండక్టర్‌పై పాము విసిరిన వృద్ధురాలు
Attack With Snake: హైదరాబాద్ విద్యానగర్‌లో మద్యం మత్తులో ఓ వృద్ధురాలు ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టింది. ఆమెను పట్టుకుని బంధించిన కండక్టర్‌పై పామును విసిరింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
Attack With Snake: హైదరాబాద్ విద్యా నగర్‌లో మద్యం మత్తులో ఓ వృద్ధురాలు చేసిన పనికి అంతా హడలిపోయారు. విద్యా నగర్ బస్‌స్టాప్ సమీపంలో బస్సును ఆపే సమయంలో బస్టాప్ నుంచి కొంత దూరంలో బస్సు ఆగింది. అక్కడ నిలిచి ఉన్న వృద్ధురాలు బీర్ బాటిల్ విసరడంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో కూర్చుని ఉన్న ప్రయాణికులపై అద్దం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి.
దీంతో బస్సును రోడ్డు పక్కన ఆపిన కండక్టర్ బాటిల్ విసిరిన వృద్ధురాలిని పట్టుకున్నారు. ఆమె మద్యం మత్తులో ఉందని గుర్తించి చేతులు కట్టేసి పోలీసులకు , ఆర్టీసీ అధికారులకు సమాచారం. ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లితే డ్రైవర్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అద్దాలు పగిలితే దాని ఖరీదును జీతం నుంచి వసూలు చేస్తారు. దీంతో దాడి ఘటనపై సమాచారం ఇచ్చేందుకు విద్యానగర్‌లోనే కొంతసేపు బస్సును నిలిపి ఉంచారు.
ఈ క్రమంలో వృద్ధురాలు చేతి కట్లు విడిపించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను అడ్డుకునేందుకు కండక్టర్ ప్రయత్నిస్తుండగా వృద్ధురాలి చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరింది. దీంతో అక్కడ గుమిగూడిన ప్రయాణికులు హడలిపోయారు. తలోదిక్కుకు పారిపోయారు. స్థానికులు అప్రమత్తమై వృద్ధురాలిని పట్టుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.
దిల్‌సుఖ్‌నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్‌వైపు వెళ్తోంది. విద్యానగర్ బస్‌స్టాప్ సమీపంలోని సిగ్నల్ వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. వృద్ధురాలి దాడిలో బస్సు వెనుక వైపు అద్దాలు పగిలిపోయాయి.
బస్సు ఆపకపోవడంతోనే కోపంతో దాడి చేసినట్టు వృద్ధురాలు చెబుతోంది. దాడి చేసిన మహిళను బేగంగా గుర్తించారు. ఆమె పాములు ఆడిస్తూ ఉపాధి పొందుతోందని గురత్ించారు.
ఈ ఘటనపై తెలంగాణ రోడ్డు రవాణా సంస్ధ ఎండీ, వీసీ సజ్జనార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, ఆర్టీసీ ఉద్యోగులు, ఆస్తులపై ఇలాంటి దాడులు మానుకోవాలని ప్రయాణికులను కోరారు. ఇలాంటి చర్యలను సహించబోమని, పోలీసుల సహాయంతో కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.
ఈ ఘటనపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే బస్సు ఎన్‌సిసి క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న విద్యా నగర్ బస్టాప్ దాటే క్రమంలో మహిళ బస్సు ఆపడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డు మలుపు ఉండడంతో బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లి స్లో చేసినట్టు వివరించారు. ఈలోగా మహిళ మద్యం బాటిల్‌తో దాడి చేసినట్టు తెలిపారు. బస్సు దాడి చేసి, కండక్టర్‌పై పాము విసిరిన మహిళపై కేసు నమోదు చేసినట్లు నల్లకుంట ఎస్‌హెచ్‌ఓ జగదీశ్వర్‌రావు తెలిపారు.