Medak Father: వాగులో కొట్టుకు పోతున్నకొడుకును ప్రాణాలకు తెగించి కాపాడిన వృద్ధుడు, మెదక్‌లో ఘటన
Medak Father: కొడుకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోతుంటే వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా ప్రవాహంలో ఈదుతూ ఒడ్డుకు చేర్చిన ఘటన మెదక్‌లో ఆదివారం జరిగింది. ప్రాణాపాయం నుంచి కుమారుడిని రక్షించిన ఘటన మెదక్‌లోని అక్బర్ పేట-భూంపల్లి మండలంలో జరిగింది.
Medak Father: రోజు మాదిరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన తండ్రి కుమారుల్లో కొడుకు ప్రమాదవశాత్తూ వాగులో పడిపోయాడు. నీటి ఒరవడికి కొట్టుకుపోయాడు. ఇది చూసిన తండ్రి ప్రాణాలను లెక్క చేయకుండా నీటిలో దూకి కొడుకును కాపాడుకున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

రోజువారీ పనుల్లో భాగంగా పంటలకు నీరు పెట్టేందుకు ఆదివారం తండ్రీకొడుకుల్లో కుమారుడు ఉదృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగులో జారి పడిపోయాడు. వాగు నుంచి మోటారుతో నీటిని తోడుతుండగా ప్రమాదవశాత్తు కుమారుడు అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న తండ్రి ప్రాణాలకు తెగించి నీళ్లల్లో కొట్టుకుపోతున్న కొడుకును రక్షించాడు.
మెదక్ జిల్లాలోని అక్బర్ పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 108 సిబ్బంది నర్సింలు, శేఖర్ అందించిన సమాచారం ప్రకారం చిట్టాపూర్‌కు చెందిన రైతు కుర్మగొల్ల మల్లయ్యకు కూడవెల్లి వాగు సమీపంలో పొలం ఉంది. మూడు రోజుల క్రితం కూడవెల్లి వాగుకు నీటిని విడుదల చేశారు. ఆ నీరు ఆదివారం చిట్టాపూర్ శివారులోకి చేరుకుంది.
దీంతో పొలానికి నీరు పెట్టేందుకు ఆదివారం ఉదయం మల్లయ్య, అతని తండ్రి నారాయణ కలిసి వెళ్లారు. మల్లయ్య తన తండ్రి నారాయణ సాయంతో వాగులో పైపులు వేసి, మోటారుతో తోడి పొలానికి నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మల్లయ్య ప్రమాదవశాత్తూ వాగులో పడి కొట్టుకుపోయాడు.
కొడుకు నీటిలో పడిపోవడం చూసిన తండ్రి వెంటనే వాగులోకి దూకి కుమారుడిని బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరిన మల్లయ్యను కుటుంబ సభ్యుల సహాయంతో 108 సిబ్బంది పొలం నుంచి దాదాపు 1 కి.మీ. దూరంలో ఉన్న ప్రధాన రహదారి మీదకు స్ట్రెచర్ పై మోసుకొచ్చారు. అనంతరం అంబులెన్సులో సిద్ధిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏడు పదుల వయసులో నారాయణ చేసిన సాహసం అందరిని అబ్బురపరిచింది. వృద్ధాప్యంలో కూడా కుమారుడి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాడని కొనియాడారు. వయసు పైబడిన తర్వాత 75 ఏళ్ల వయసులో పొలం పనుల్లో కుమారుడికి చేదోడుగా ఉంటున్నాడు.