సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ బయటపడింది. ముఖ్యమంత్రి సహాయ నిధి స్కీమ్ డబ్బులను కాజేసేలా నకిలీ లబ్ధిదారులను సృష్టించి… చెక్కులను డ్రా చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 8 మందిని మేళ్లచెర్వు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే దగ్గర పని చేసిన వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.7.3 లక్షల నగదు… వినియోగించని 44 చెక్కులు, ఆరు బ్యాంక్ పాస్‌పుస్తకాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నర్సింహ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మేళ్లచెర్వుకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యానికి గురై ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్పటి ఎమ్మెల్యే సైదిరెడ్డి ద్వారా దరఖాస్తు చేశాడు. నెలలు గడుస్తున్నా తనకు సాయం అందకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లి విచారించగా.. అతడి పేరిట చెక్కు విడుదలైందని, దాన్ని ఎవరో సొమ్ము చేసుకున్నారని తెలిసింది.
దీంతో ఎవరైతే చెక్కును డ్రా చేశారో వారి వివరాలను తెలుసుకున్న ఆ వ్యక్తి… వారి వద్దకు వెళ్లి ప్రశ్నించటంతో అసలు విషయం బయటికి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే దగ్గర పని చేసిన ఓంకార్, కంప్యూటర్ ఆపరేటర్‌గా అయిన వెంకటేశ్వర్లు దీని వెనుక ఉన్నట్లు బయటికొచ్చింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా… పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చెక్కులను డ్రా చేసేందుకు పదుల సంఖ్యలో నకిలీ లబ్ధిదారులను సృష్టించినట్లు వెల్లడైంది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
నిజానికి ఒక్క సూర్యాపేట జిల్లాలోనే కాదు… పలు జిల్లాల్లో కూడా ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. ఫేక్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నిధులను మింగేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఐడీ కూడా దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది..!
సంబంధిత కథనం