TG Education Department : తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఒకేసారి 12 మంది ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్
TG Education Department : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 మంది హెచ్ఎంలను సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. 12 మందిని సస్పెండ్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణలో గతేడాది సెప్టెంబరులో ఉపాధ్యాయుల బదిలీల జరిగాయి. టీచర్ల ట్రాన్స్‌ఫర్ సమయంలో.. స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 12 మంది ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఈ 12 మందిలో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 10 మంది హెచ్‌ఎంలు ఉన్నారు. జనగామ జిల్లా, వనపర్తి జిల్లాలో ఒక్కో హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
12 మంది ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ.. హైదరాబాద్ ఆర్జేడీ విజయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బదిలీలు జరిగిన ఏడాది తర్వాత సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. సస్పెన్షన్ ఆదేశాలపై పునరాలోచించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇష్యూ ఏంటీ..
నిబంధనల ప్రకారం.. బదిలీ సందర్భంగా భర్త లేదా భార్య తన స్పౌజ్ పనిచేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఈ విషయంలో కొందరు స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. మహబూబ్‌నగర్‌లో ఒకరు తన స్పౌజ్ పనిచేసే పాఠశాలకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వకుండా నాలుగో ఆప్షన్ ఇచ్చుకున్నారు. అయినా.. తన స్పౌజ్ పనిచేసే పాఠశాలకే బదిలీ అయ్యారు. ఫస్ట్ ఆప్షన్ ఇవ్వకుండా.. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు ఇచ్చుకున్నారని సస్పెండ్ చేశారు.
గతేడాదిలోనే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను చేపట్టారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు కసరత్తు చేశారు. అయితే ప్రమోషన్లకు టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరని హైకోర్టు తీర్పునివ్వటంతో.. ప్రక్రియకు బ్రేకులు పడినట్లు అయింది. చాలా మంది టీచర్లకు టెట్ లేకపోవటంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 317తో ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావటంతో తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. వీటికితోడు పలు అంశాలపై గందరగోళం నెలకొనటంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పాటు ఎన్నికల కోడ్ రావటంతో ముందుకు కదల్లేదు. తీరా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అయిపోయాక.. విద్యాశాఖ తాజాగా సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.