MLC Kavitha : లిక్కర్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ-ed questions brs mlc kalvakuntla kavitha in delhi liquor scam case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Questions Brs Mlc Kalvakuntla Kavitha In Delhi Liquor Scam Case

MLC Kavitha : లిక్కర్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 08:18 PM IST

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఇవాళ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో దాదాపు ఎనిమిది గంటల పాటు అధికారులు కవితను విచారించారు. వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మార్చి 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చారు.

ముగిసిన కవిత ఈడీ విచారణ
ముగిసిన కవిత ఈడీ విచారణ

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో దాదాపు ఎనిమిది గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ జరిగింది. కవితను మొత్తం ఐదుగురు ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లైతోపాటు కవితను విచారించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా.. ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ముందుగా కవిత వ్యక్తిగత సమాచారం అడిగిన ఈడీ... అనంతరం మద్యం పాలసీ, సౌత్ గ్రూప్ ప్రమేయం, ఇండో స్పిరిట్స్ లో వాటాలకు సంబంధించి ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపైనా ఈడీ అధికారులు లోతుగా విచారించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా లంచ్, టీ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు... విరామం తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. హవాలా నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు నమోదు చేశారు. ఈ కేసులో మరోసారి కవితను విచారించనున్న ఈడీ అధికారులు... మార్చి 16న మళ్లీ విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు.

ఈ కేసులో అరెస్ట్ అయి నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై విచారణలో స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని పేర్కొన్నాడు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎంలతో కవితకు రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు తన వాంగ్మూలంలో చెప్పినట్లు ఈడీ వివరించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తే.. ఆప్ కు నిధులు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని.. 2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్ నాయర్ ను కవిత కలిశారని ఈడీ పేర్కొంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఈడీ అధికారులు పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు. ఇండో స్పిరిట్ లో కవితకు 32.5 శాతం వాటా ఉందని వెల్లడించింది. అందరికీ కలిపి మొత్తం రూ. 292 కోట్లు ముట్టినట్లు స్పష్టమైందని వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ లాభం ద్వారా రూ. 192 కోట్లు దక్కించుకుందని ఈడీ వివరించింది. గతంలోనూ పలు ఛార్జిషీట్ లలో ఈడీ కవిత పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసి ఇవాళ విచారించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్టు అయ్యారు. ఇదే కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీశ్ సిసోడియాకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఏడు రోజుల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అనుమతించింది. మార్చి 17 వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉంటారు. ఈడీ కేసులో అరెస్టయిన మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్ తో పాటు లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఏడుగురు నిందితులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

IPL_Entry_Point