KTR ED Investigation : నగదు బదిలీ చుట్టూనే ప్రశ్నలు..! ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ-ed questioned ktr for more than six hours in the formula erace case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Ed Investigation : నగదు బదిలీ చుట్టూనే ప్రశ్నలు..! ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ

KTR ED Investigation : నగదు బదిలీ చుట్టూనే ప్రశ్నలు..! ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 16, 2025 05:44 PM IST

Formula-E race case Updates : ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ ను ఈడీ విచారించింది. దాదాపు ఏడు గంటలకుపైగా ప్రశ్నించింది. ప్రధానంగా నగదు బదిలీ చుట్టూనే దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు తెలిసింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఫార్ములా ఈరేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆయన్ను ఏడు గంటలకుపైగా విచారించింది. ప్రధానంగా నగదు బదిలీ చుట్టూనే ఈడీ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. నిబంధనలు పాటించకుండా పౌండ్లలోకి మార్చి పంపడంతో పాటు…హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపుపైన ఆరా తీసినట్లు సమాచారం.

yearly horoscope entry point

ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ విచారించింది. అయితే వీరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు.. కేటీఆర్ ను కొన్ని అంశాలపై విచారించినట్లు తెలిసింది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై ప్రశ్నించింది.

ఇక ఇవాళ ఉదయం గచ్చిబౌలి లోని తన నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్.. నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా… చాలా మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక విచారణకు వెళ్లటానికి ముందుకు కేటీఆర్ ఓ ట్వీట్ కూడా పోస్ట్ చేశారు. 'మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేస్‌ను హోస్ట్ చేయడం.. నాకు అత్యంత ఇష్టమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ ప్రతినిధులు మన నగరాన్ని ప్రశంసిస్తున్నప్పుడు.. నేను అనుభవించిన గర్వం చిరస్మరణీయమైనది. ఎన్ని పనికిమాలిన కేసులు పెట్టినా.. బురదజల్లే రాజకీయాలు చేసినా.. ఆ గర్వాన్ని తగ్గించలేవు' అని కేటీఆర్ రాసుకొచ్చారు.

ఇటీవలే ఏసీబీ విచారణ….

ఇక ఫార్ములా-ఈ రేసు కేసులో ఇటీవలనే ఏసీబీ కూడా కేటీఆర్ ను విచారించింది. ఏసీబీ కార్యాలయం లోపలికి న్యాయవాదితో కలిసి వెళ్లగా… 6 గంటలకుపైగా కేటీఆర్ ను విచారించారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ తరపున అడ్వొకేట్ రామచంద్రరావును అనుమతించారు. ఏసీబీ ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. ఇది ఒక చెత్త కేసు అని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4 ప్రశ్నలు పట్టుకొని… 40 రకాలుగా అడిగారని వ్యాఖ్యానించారు. ఇది అసంబద్ధమైన కేసు అని చెప్పారు. మళ్లీ ఏసీబీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని స్పష్టం చేశారు.

మరోవైపు ఫార్ములా ఈరేస్ కేసులో తనపైన నమోదైన కేసులపై కేటీఆర్ న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే… తాజాగా సుప్రీంకోర్టును కూడా కేటీఆర్ ఆశ్రయించారు. అయితే ఇక్కడ కూడా తన క్వాష్ పిటిషన్ ను ఉపసహరించుకున్నారు. లీగల్ టీమ్ తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని… ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

ఇక ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఏసీబీ కూడా స్పీడ్ పెంచింది. తాజాగా ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ వ్యవహారంపైనా దృష్టి సారించింది. ఈనెల 18న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. రేస్‌ నిర్వహణలో ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ తొలి ప్రమోటర్‌గా ఉంది. ఈ క్రమంలోనే వీరికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ తో పాటు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించిన సంగతి తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం