ED Notices to Rohit Reddy : డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు !-ed issues notices to rohit reddy in bengalore drugs case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Issues Notices To Rohit Reddy In Bengalore Drugs Case

ED Notices to Rohit Reddy : డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు !

HT Telugu Desk HT Telugu
Dec 16, 2022 02:08 PM IST

ED Notices to Rohit Reddy : బెంగళూరు డ్రగ్స్ పార్టీ కేసు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2021లో నమోదైన ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, నటి రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (facebook)

ED Notices to Rohit Reddy : టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. 2021లో బెంగళూరు పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్త కళహర్ రెడ్డితో కలిసి బెంగళూరులో డ్రగ్స్ పార్టీకి రోహిత్ రెడ్డి వెళ్లినట్లు నోటీసుల్లో పేర్కొంది. సినీ నిర్మాత శంకర్ గౌడ్ ఆ పార్టీ ఇచ్చినట్లు తెలిపింది. పార్టీ కోసం రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ నైజీరియన్ల నుంచి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదే కేకసులో నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోవడంతో.. ఈడీ అధికారులు అమెను అప్పుడు పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. దీంతో మరోసారి విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

కాగా.. ఈడీ నోటీసులు అందాయని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. 19వ తేదీన ఈడీ ఆఫీసుకి రావాలని చెప్పారని.. అయితే కేసు వివరాలు మాత్రం అందించలేదని చెప్పారు. ఆధార్, ఓటర్ ఐడీ సహా ఆర్థిక లావాదేవీల వివరాలు తీసుకొని రావాలని పేర్కొన్నారన్నారు. కేసు వివరాలు లేకుండా ఇచ్చిన నోటీసులపై న్యాయనిపుణులతో చర్చిస్తానని.. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్పందిస్తానని రోహిత్ రెడ్డి అన్నారు.

బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుందని రెండు రోజుల క్రితమే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయని వెల్లడించారు. సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసిన మూడో రోజే... రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు పంపడం.. సంచలనంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. రోహిత్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు రామచంద్ర భారతి, నందు, సింహయాజీలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

WhatsApp channel