Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ 7వ ఛార్జీషీట్ - నిందితురాలిగా కవిత పేరు..!
Delhi Liquor Scam Updates : ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఏడో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా చేర్చింది.
Delhi Liquor Scam Updates : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి తాజాగా ఇవాళ(శుక్రవారం)ఈడీ అనుబంధ ఛార్జీషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఢిల్లీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ వేసింది. కవిత పాత్రపై మరికొన్ని అంశాలను ఇందులో చేర్చింది.
ఈ కేసులో ప్రస్తుతం 7వ అనుబంధ ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది. శుక్రవారం మధ్యంతర బెయిల్ పొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ఈ చార్జ్‌షీట్‌లో పేర్కొనలేదు. వచ్చే వారంలోగా కేజ్రీవాల్‌పై ప్రత్యేక సప్లిమెంటరీ ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులతో సహా ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు ఈడీ చేసింది. సంజయ్ సింగ్‌కు కొంతకాలం క్రితం రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.
లిక్కర్ కేసులో ఆగస్టు 17, 2022న సీబీఐ కేసు నమోదు చేసింది. నాటి ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ… మనీలాండరింగ్ కింద ఆగస్టు 22, 2022 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది.
పీఎంఎల్ఏ చట్టం కింద మార్చి 21న కేజ్రీవాల్‌ను ఆయన అధికారిక నివాసంలో ఈడీ అరెస్ట్ చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె అయిన ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.
సౌత్ గ్రూప్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు సుమారు రూ. 100 కోట్లు లంచాలు అందుకున్నారనేది ఈ కేసులో ప్రధానంగా ఉంది. ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారుగా ఉన్నారని తాజా ఛార్జీషీట్ లో నూ పేర్కొంది. ఇంకా విచారణ సాగుతోందని తెలిపింది.
పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్లు 45, 44 (1) కింద కవితపై అరెస్ట్ చేసిన 60 రోజుల వ్యవధిలోనే ఛార్జీషీట్ ను దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
దక్కని ఊరట….
Mlc Kavitha Bail: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఊరట దక్కలేదు. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను రెండు వారాల పాటు వాయిదా పడింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభిప్రాయాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. దీంతో తదుపరి విచారణను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
మనీలాండరింగ్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు మే 6న ఇచ్చిన ఉత్తర్వులను కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులో కూడా ట్రయల్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.