Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్న ఈడీ-ed arrests arun ramachandra pillai in delhi liquor scam case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Arrests Arun Ramachandra Pillai In Delhi Liquor Scam Case

Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్.. రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్న ఈడీ

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 04:02 PM IST

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ సోమవారం అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో రిమాండ్ లోకి తీసుకొని మరిన్ని విషయాలపై ఆరా తీసే అవకాశముంది. కాగా... పిళ్లై, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది.

అరుణ్ రామచంద్రం పిళ్లై
అరుణ్ రామచంద్రం పిళ్లై

Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు... తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్టు చేశాయి. సోమవారం దాదాపు 4 గంటల పాటు పిళ్లైని విచారించిన ఈడీ అధికారులు... అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పిళ్లై హస్తం ఉన్నట్లు పేర్కొన్న ఈడీ అధికారులు... హవాలా నిరోధక చట్టం కింద అతడిని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో పిళ్లైని హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ ఇప్పటికే 39 సార్లు పిళ్లైని విచారణకు పిలిచాయని.. కానీ ఆయన దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకి వివరించారు. వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కోర్టు అనుమతితో రిమాండ్ లోకి తీసుకొని మరిన్ని విషయాలపై ఆరా తీసే అవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకి సంబంధించి ఇటీవల రెండు రోజుల పాటు అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ ప్రశ్నించింది. ఆయనపై తొలుత అభియోగాలు నమోదు చేసిన సీబీఐ.. హైదరాబాద్ కేంద్రంగా పలుదఫాలు సోదాలు జరిపింది. పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి.. కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఆయన పేరుని కూడా దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. హైదరాబాద్ శివారులో పిళ్లైకి చెందిన రూ. 2 కోట్ల విలువైన ఆస్తులని అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.

ఎవరీ అరుణ్ రామచంద్రం పిళ్లై.. ?

దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆప్ నేతలకు ముడుపు చెల్లించిన సౌత్ గ్రూప్ లో... పిళ్లై కూడా భాగస్వామి. దక్షిణాదికి చెందిన లిక్కర్ సంస్థ ఇండో స్పిరిట్స్ లో ఆయన కీలక వ్యక్తిగా ఉన్నారు. ఈ కంపెనీలో పిళ్లైకు 32.5 శాతం షేర్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. ఢిల్లీలో లిక్కర్ లైసెన్సులు పొందేందుకు అధికారులకి ముడుపులు చెల్లించారనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. అలాగే.. ఢిల్లీ మద్యం పాలసీ రూపొందించడంలో పిళ్లై కూడా కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది. కార్టిలైజేషన్ ద్వారా ఇండోస్పిరిట్స్ ఆర్జించిన రూ. 69 కోట్లలో .. రూ. 29 కోట్లు పిళ్లై ఖాతాలకు మళ్లించారని ఈడీ గుర్తించింది. అలాగే... ఓ టీవీ ఛానల్ అధినేతకు రూ. 4.75 కోట్లు.. అభిషేక్ బోయిన్ పల్లికి రూ. 3.85 కోట్లు పిళ్లై చెల్లించారని తేల్చింది. ఈ కేసులో అభిషేక్ బోయిన్ పల్లి ఇప్పటికే అరెస్టయిన విషయం తెలిసిందే.

రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్ పీ సంస్థలతో పిళ్లై ఆర్థిక లావాదేవీలు జరిపారని... దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆ సంస్థల చిరునామాలు పరిశీలించగా... అవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల పేరిట ఉన్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థల తర్వాతి టార్గెట్ ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది.

IPL_Entry_Point