ED IT Raids On TRS Leaders: మొన్న గంగుల.. తాజాగా మల్లారెడ్డి... నెక్స్ట్ ఎవరు..?-ed and it raids on ministers and trs leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed And It Raids On Ministers And Trs Leaders

ED IT Raids On TRS Leaders: మొన్న గంగుల.. తాజాగా మల్లారెడ్డి... నెక్స్ట్ ఎవరు..?

HT Telugu Desk HT Telugu
Nov 23, 2022 06:15 AM IST

ED IT Raids in Telangana: గత కొన్ని రోజులుగా ఐటీ, ఈడీ దాడులు... తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో అధికార టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ క్షణంలో ఏ నేత ఇంటిపై రైడ్ జరుగుతుందో అర్థం కావటం లేదు. మంత్రి గంగులతో షురూ అయిన దాడులు...తాజాగా మంత్రి మల్లారెడ్డికి ఇంటికి చేరాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది.

తెలంగాణలో ఈడీ ఐటీ సోదాలు
తెలంగాణలో ఈడీ ఐటీ సోదాలు

ED and IT Raids On TRS Leaders: ఈడీ... ఐటీ రైడ్స్.... ప్రస్తుతం తెలంగాణలో ఎటుచూసిన ఇదే చర్చ..! అందులోనూ అధికార పార్టీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నట్లు సీన్ కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగులతో మొదలైన ఈ రైడ్స్.... తాజాగా మల్లారెడ్డి వరకు చేరాయి. మధ్యలో మంత్రి తలసాని బ్రదర్స్ కూడా సీన్ లో కి వచ్చారు. ఇళ్లు, కార్యాలయాలే కాదు బంధువుల ఇళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. మరోవైపు లిక్కర్ స్కామ్ లోనూ నోటీసులు, విచారణ ముమ్మరంగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.... అధికార టీఆర్ఎస్ అప్రమత్తమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కూడా హుటాహుటిన ఓ భేటీని కూడా నిర్వహించారు. ఈ క్రమంలో... మరికొందరు ముఖ్య నేతలపై కూడా ఈడీ, ఐటీ రైడ్స్ జరగటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పడు ఈ అంశమే.... అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిందనే చర్చ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోయాయి. సీన్ కట్ చేస్తే... బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్... పీక్స్ కు చేరింది. ఓవైపు ఉపఎన్నికకు పోలింగ్ జరగకముందే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం రేపింది. ఓవైపు మునుగోడుకు ముందే లిక్కర్ కేసు... తెలంగాణ రాజకీయాలను హీట్ ఎక్కించింది. ఇందులో పలువురు టీఆర్ఎస్ నేతల పేర్లు రావటం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా నడుస్తున్న క్రమంలో... ఎమ్మెల్యేల ఎర కేసు సరికొత్త పరిణామాలకు దారి తీసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్... ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది. బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ కు నోటీసుల వ్యవహరం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చే పనిలో సిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఒక్కసారిగా ఈడీ, ఐటీ రైడ్స్ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. మంత్రి గంగుల గ్రానైట్ కంపెనీల్లో రెండు రోజుల పాటు సోదాలు జరిగాయి. అంతేకాకుండా... టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీస్, ఇంటిలోనూ రైడ్సింగ్ జరిగాయి. ఈ పరిణామం అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ పుట్టించింది.

ఈ వేడి చల్లారకముందే.... మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులు, ఆయన పీఏను ఈడీ విచారణకు పిలిచింది. చికోటి ప్రవీణ్‌ క్యాసినో కేసుకి సంబంధించి వారికి నోటీసులు జారీ చేసి విచారించింది. క్యాసినో ఆడేందుకు వెళ్లిన సమయంలో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఆరాతీసింది. అలాగే నగదు డిపాజిట్లకు సంబంధించిన విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే కేసులో TRS ఎమ్మెల్సీ రమణకు కూడా నోటీసులు వచ్చాయి. అంతేకాదు విచారణకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు కూడా గురయ్యారు.

తాజాగా మంగళవారం ఉదయం నుంచే మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లు , కార్యాలయాలపై ఐటీ శాఖ విస్తృత సోదాలు చేపట్టింది. గత పదేళ్లుగా మల్లారెడ్డి కుటుబం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌, వైద్య, డెంటల్‌, ఇతర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ఏకంగా 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏక కాలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు తనిఖీల్లో నగదు, బంగారం, కీలపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న కీలకపత్రాలను విశ్లేషిస్తున్నారు. దాదాపుగా 50చోట్ల సాగుతున్న ఈ తనిఖీల్లో దస్త్రాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఈ స్థాయిలో దాడులు చేపట్టడం రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

గతంలోనూ రైడ్స్...

నిజానికి ప్రస్తుతం జరుగుతున్న దాడులు కాకుండా కొద్దిరోజుల కిందట టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు నివాసం, కంపెనీల్లోనూ ఈడీ సోదాలు చేసింది. మధుకాన్‌ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ డైరెక్టర్ల ఇళ్లతో సహా ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. దీనిపై 2019లోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. అంతకుముందు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డిలు టార్గెట్‌గా ఈడీ దాడులు జరిగాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డిని కూడా రెండు రోజుల పాటు ఈడీ విచారించింది. ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన విషయంలో ప్రశ్నల వర్షం కురిపించినట్లు వార్తలు వచ్చాయి.

ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరిపై ఐటీ, ఈడీ బృందాలు సోదాలు, నోటీసులు ఇస్తుండటంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైనట్లు చర్చ నడుస్తోంది. ఏ క్షణం ఏ నేత ఇంటిపై రైడ్ జరుగుతుందో అర్థం కావటం లేదు. పార్టీలో ఏ ఇద్దరు, ముగ్గురు కలిసినా వీటి మీదే చర్చ జరుగుతోందట. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని కేసీఆర్ ముందుగానే పసిగట్టారు. దీనిపై గత కొద్దిరోజులుగానే నేతలకు దిశానిర్దేశం చూస్తే వచ్చారు. ఈడీ, ఐటీ రైడ్స్ కి భయపడవద్దని... ధైర్యంగా ఎదుర్కొవాలని సూచిస్తూ వచ్చారు. అయినప్పటికీ.. పదుల సంఖ్యల విచారణ బృందాలు రంగంలోకి దిగుతుండటంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలవరం మొదలైంది. నెక్స్ టార్గెట్ ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మరో మంత్రిపై కూడా రైడ్స్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point