Dynamic Pricing : రైలు ఛార్జీలపై దొంగదెబ్బ….ప్రయాణికుల జేబులు ఖాళీ…-dynamic prices burden on rail passengers ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Dynamic Prices Burden On Rail Passengers

Dynamic Pricing : రైలు ఛార్జీలపై దొంగదెబ్బ….ప్రయాణికుల జేబులు ఖాళీ…

B.S.Chandra HT Telugu
Aug 06, 2022 08:39 AM IST

రైలు ప్రయాణాల్లో రాయితీలను రద్దు చేయడం ద్వారా భారం వదిలించుకుంటున్న రైల్వే శాఖ లాభాల కోసం కొత్త పద్ధతులు మొదలు పెట్టింది. రైలు ఛార్జీలలో బేస్‌ ప్రైస్‌ను మొదటి పదిశాతం టిక్కెట్లకే అమలు చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత డిమాండ్‌ బట్టి ధర పెంచుకునేలా మార్పులు చేస్తోంది.

డైనిమిక్ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లు
డైనిమిక్ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లు

సామాన్యుల రవాణా రైలు ప్రయాణాల విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే….ముందస్తు ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకుంటే జేబులు ఖాళీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇప్పటికే రాయితీల వల్ల రైల్వే శాఖకు భారీగా నష్టం వాటిల్లుతోందని చెబుతున్న ఆ శాఖ ప్రయాణికుల రవాణాపై వస్తున్న నష్టాలను క్రమంగా తగ్గించుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

రైళ్లలో ప్రయాణికుల్ని తీసుకెళ్లడం కంటే సరకు రవాణా చేయడమే ఉత్తమం అని రైల్వే శాఖ ఎప్పట్నుంచో చెబుతోంది. ప్రతి రైలు ప్రయాణంపై బోలెడు భారాన్ని మోయాల్సి వస్తోందని తరచూ ఆ శాఖ ప్రకటిస్తూనే ఉంటుంది. కోవిడ్ కారణంగా రెండేళ్ళకు పైగా రైల్వే శాఖకు ప్రయాణికుల్ని తీసుకువెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో లాభాలు ఎంతో బాగా తెలిసొచ్చాయి. దీంతో కరోనా కారణంగా రైళ్లలో రకరకాల రాయితీలను కూడా తొలగించేశారు. ప్రయాణికుల రవాణపై లాభాలు పొందడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. డిమాండ్ ఉండే రూట్లలో నడిచే రైళ్లలో దశల వారీగా డైనమిక్ ఛార్జీలను అమలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది.

ప్రస్తుతం కొన్ని రైళ్లలో అమలు చేస్తున్న డైనమిక్ టిక్కెట్ ప్రైసింగ్ విధానాన్ని త్వరలో మరిన్ని రైళ్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతమున్న మూడు రైళ్లతో పాటు మరిన్ని రైళ్లకు డైనమిక్ ప్రైసింగ్ అమలు చేయాలని యోచిస్తోంది. ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండే మార్గాల్లో నడిచే రైళ్లకు రద్దీకి అనుగుణంగా ధరల్ని పెంచే ప్రతిపాదన చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వేే పరిధిలో ‌సికింద్రబాద్‌ నుంచి ఢిల్లీ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలకు రైళ్లకు నెలల ముందే టిక్కెట్లు బుక్ అవుతుండటంతో ఏయే రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ ఉండే రైళ్లకు డైనమిక్ ఛార్జీలను అమలు చేసేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

రైలు ప్రయాణానికి ముందు కరెంట్ బుకింగ్ చేసుకునే వారికి, అత్యవసర ప్రయాణాలకు సిద్ధమయ్యే వారికి డైనమిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదిస్తున్నా, ధరల పెంపుతో ఆదాయం పెంచుకోవడమే రైల్వే శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. సాధారణ టిక్కెట్లతో పోలిస్తే తత్కాల్ టిక్కెట ధరలు ఎక్కువగా ఉంటాయి. డైనమిక్ విధానంలో రైల్లో అందుబాటులో ఉండే మొదటి 10శాతం సీట్లకు సాధారణ ధరకు విక్రయిస్తారు.

ఆ తర్వాత నుంచి టిక్కెట్ ధర డిమాండ్‌కు అనుగుణంగా పెరుగుతుంటుంది. రైలు టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే బుక్ చేసుకోకపోతే జేబులు ఖాళీ కాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణ తేదీని నెలల ముందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి రైల్లో 90 శాతం టిక్కెట్లపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది. ప్రతి రూ.100 టిక్కెట్‌ ధరలో చివరి పది శాతం టిక్కెట్లపై 50శాతం ధరల పెంపు వర్తిస్తుంది.

ఉదాహరణకు ఓ రైల్వే 100 సీట్లు లేదా బెర్తులు ఉంటే మొదటి పది టిక్కెట్లు మాత్రమే రూ.100రుపాయలకు లభిస్తాయి. ఆ తర్వాత రూ.110 నుంచి రూ.150వరకు ధర పెరుగుతూ ఉంటుంది. రిజర్వేషన్‌, క్యాటరింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డైనమిక్‌ చార్జీలు అమలవుతున్న రైళ్లకు, అమలు కాని రైళ్లకు మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉంటుోంది. హైదరాబాద్‌ విశాఖ మధ్య డైనమిక్‌, నాన్‌ డైనమిక్‌ రైళ్ల ధరల్లో సగటు రూ.600-700వరకు వ్యత్యాసం ఉంటోంది.

WhatsApp channel

టాపిక్