Dussehra 2022 : ఎన్ని లక్షల పెట్రోల్, డీజిల్ వినియోగం అవుతుందో తెలుసా?-dussehra 2022 heavy rush at railway stations and bus stations in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dussehra 2022 : ఎన్ని లక్షల పెట్రోల్, డీజిల్ వినియోగం అవుతుందో తెలుసా?

Dussehra 2022 : ఎన్ని లక్షల పెట్రోల్, డీజిల్ వినియోగం అవుతుందో తెలుసా?

Anand Sai HT Telugu
Oct 02, 2022 02:23 PM IST

Dussehra Rush In Hyderabad : దసరా ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నగరాల నుంచి గ్రామాలకు వెళ్తున్నారు జనాలు. ఇక హైదరాబాద్ పట్టణంలో అయితే ఎక్కడ చూసినా రద్దీగా కనిపిస్తోంది. పల్లెలకు వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

దసరా ఉత్సవాల్లో భాగంగా జనాలు పల్లెలకు వెళ్తున్నారు. వారాంతపు సెలవులు, ఆ తర్వాతి ముఖ్యమైన పండుగల కోసం ప్రయాణికులు తమ స్వస్థలాలకు బయల్దేరారు. నగరం అంతటా రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ రద్దీగా కనిపించాయి. ప్రత్యేక సర్వీసులలో సీట్లు పొందలేని వారు పెద్ద సంఖ్యలో టాక్సీలను అద్దెకు తీసుకుని వెళ్తున్నారు.

పండుగ సీజన్‌లో నగరంలోని టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా లాభాలను ఆర్జించడంతో డ్రైవర్లకూ భారీ డిమాండ్ ఉంది. శనివారం నాడు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిటకిటలాడాయి. శుక్ర, శనివారాల్లో డీజిల్‌, పెట్రోల్‌ విక్రయాల్లో 20 శాతం పెరుగుదల నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిరోజూ 45 లక్షల లీటర్ల డీజిల్‌, 35 లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నారు. అయితే వారాంతంలో ఇది బాగా పెరిగింది. సొంత వాహనాల మీద వెళ్లేవారు.. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) కూడా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం రాత్రి నుంచి అదనంగా 4,198 ప్రత్యేక సర్వీసు బస్సులను ప్రారంభించింది. గత శనివారం నుండి పండుగ రద్దీ మొదలైందని, నగరం నుండి వివిధ ప్రాంతాలకు బస్సులను అదనంగా చేర్చామని TSRTC రంగా రెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ చెప్పారు. శుక్రవారం నుండి ఆర్టీసీలో రద్దీ ఎక్కువగా ఉందని, ప్రయాణికులెవరూ అసౌకర్యానికి గురికాకుండా చూస్తున్నామన్నారు.

ఇక ప్రైవేట్ బస్సుల్లో మాత్రం ఛార్జీలు దారుణంగా వసూలు చేస్తున్నారు. నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా, దీపావళి పండుగల సందర్బంగా 315 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఇంకా రద్దీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపు 100 ప్రత్యేక రైళ్లు పట్టాలపైకి వెళ్తాయని అధికారులు చెబుతున్నారు.

సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా ఉన్నాయి. రైళ్ల టైమింగ్స్ కంటే ముందుగాననే స్టేషన్ కి వస్తున్నారు. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయింది. ప్రత్యేక రైళ్లకు తత్కాల్ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. సుమారు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయినట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం