Flight Emergency Landing: దుబాయ్ నుంచి కొచ్చికి బయలుదేరిన ఇండిగో విమానంలో మద్యం సేవించిన నలుగురు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు. వారితో గొడవ పడుతూ బీభత్సం సృష్టించారు. పక్క సీట్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. తోటి ప్రయాణికులు, సిబ్బంది సర్ది చెబుతున్నా వినకుండా భయాందోళనకు గురి చేశారు.
మద్యం మత్తులో ఉన్న ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడికి యత్నించారు. వారిని సముదాయించేందుకు ప్రయత్నించిన వారితో పాటు ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. నిందితులు ఎంతసేపటికి గొడవ ఆపకపోవడంతో ఫ్లైట్ క్రూ పైలట్లకు సమాచారం ఇచ్చారు.
దీంతో కొచ్చి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాల్సిన విమానాన్ని పైలట్ దారి మళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానాశ్రయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న పోలీసులకు అప్పగించారు. ఈ గొడవపై కేసు నమోదు చేసిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అదికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇండిగో విమాన సంస్థ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.