Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో 24 గంటలపాటు నీటి సరఫరా బంద్..!-drinking water supply to be interrupted on jan 11 in parts of hyderabad city areas list here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో 24 గంటలపాటు నీటి సరఫరా బంద్..!

Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ఈ ప్రాంతాల్లో 24 గంటలపాటు నీటి సరఫరా బంద్..!

Hyderabad Drinking Water Supply: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు HMWSSB అధికారులు ప్రకటన చేశారు.

నగరంలో నీటి సరఫరా..! (image source .istockphoto.com)

హైదరాబాద్‌ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి 11వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని ప్రకటించారు. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్‌బే, మీరాలం ఫిల్టర్ బెడ్స్, సెటిల్లింగ్ ట్యాంక్‌లు ,ఇన్‌లెట్ ఛానెళ్లను శుభ్రపరిచే పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ప్రకటించింది. ఈ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తి అంతరాయం ఏర్పడుతుందని… మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం ఉంటుందని తెలిపింది.

ఏ ఏ ప్రాంతాలంటే..?

జనవరి 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జనవరి 12వ తేదీ ఉదయం 6 గంటల ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. హసన్ నగర్, కిషన్ బాగ్, దూద్ బౌలి, మిస్రిగంజ్, పతేర్‌ఘట్టి, దార్-ఉల్-షిఫా, మొఘల్‌పురా, జహనుమా, చందూలాల్ బరాదరి, ఫలక్‌నుమా, జంగంమెట్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని ప్రకటించారు. నీటి సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మెట్రో రైలు విస్తరణ - సీఎం కీలక ఆదేశాలు:

ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రో మార్గాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళికలు (డీపీఆర్‌లు) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం సూచించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల‌పై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం - ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్‌ - శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యార‌డైజ్ - మేడ్చ‌ల్ మెట్రో (23 కి.మీ.) మార్గాల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని సీఎం సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాలన్నారు. మేడ్చ‌ల్ మార్గంలో ఎన్‌హెచ్ మార్గంలో ఇప్ప‌టికే ఉన్న మూడు ఫ్లైఓవర్ల‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలని… ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభ‌మయ్యేలా చూసుకోవాలని.. అక్క‌డ అధునాతన వ‌స‌తులు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భారీ జంక్ష‌న్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.