హన్మకొండలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారాన్ని డీఆర్ఐ అధికారులు గుట్టురట్టు చేశారు. ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ జోన్ అధికారులు నిఘా పెట్టారు. అక్టోబర్ 4వ తేదీన ఆపరేషన్ చేపట్టగా… నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి మొత్తం 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ పొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సుమారు ఐదు పాంగోలిన్ల నుంచి పొందినట్లు అంచనా వేశారు. నిందితులను తదుపరి దర్యాప్తు కోసం హన్మకొండలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.
పాంగోలిన్‌లను ప్రధానంగా చైనా, ఆగ్నేయాసియాలో వేటాడుతుంటారు. వాటి విలువైన పొలుసుల కోసమే ఈ వేట సాగుతుంది. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్-Iలో జాబితాలో ఇండియన్ పాంగోలిన్ ఉండటంతో పాటు ఇటువంటి జంతువుల వేటపై నిషేధం అమలులో ఉంది.
పాంగోలిన్ (అలుగు) చూసేందుకు ముంగీసలా కనిపిస్తుంది. తల నుంతి తోక వరకూ పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులు చాలా గట్టిగా ఉంటాయి. కాస్త చప్పుడు వినిపించినా.. భయంతో బొరియల్లో ముడుచుకుని కదలకుండా ఉంటుంది. అలుగులో ఔషధ గుణాలు ఎక్కువ అని చెబుతుంటారు. చైనా, వియత్నాంలో దీని మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీని పొలుసును ఖరీదైన వస్త్రాలు, ఆభరణాల్లో వాడుతుంటారు. పొలుసుల పొడిని మందుల్లో ఉపయోగిస్తారు. ఒక్కొక్కటి కోటి రూపాయల వరకు ధర పలుకుతూ ఉంటుంది. అక్రమార్కులు సులభంగా సంపాదించేందుకు వీటిని వేటాడుతూ ఉంటారు. చట్ట ప్రకారం వీటిని వేటాడం నిషేధం..!
సంబంధిత కథనం