Scientist Suicide :స్నేహితుల మోసంతో డిఆర్‌డిఎల్ సైంటిస్ట్ ఆత్మహత్య
Scientist Suicide స్థిరాస్తి వ్యాపారంలో లాభాలంటూ డిఆర్‌డిఎల్ సైంటిస్ట్ పోయారు. కోటి రూపాయలు రుణం తీసుకుని స్నేహితులకు ఇచ్చాడు. నమ్మించి వ్యాపారం చేస్తే ఆర్థికంగా మోసం చేశారని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

Scientist Suicide మంచి ఉద్యోగం, చక్కటి కుటుంబంతో సాగిపోతున్న కుటుంబానికి స్నేహితుల రూపంతో ఆపద ఎదురైంది. వ్యాపారం పేరుతో నమ్మించి మోసం చేయడంతో భారీగా నష్టపోయారు. సొంతింటిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన యువ శాస్త్రవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్ గుల్ లో యువశాస్త్రవేత్త వనం రమేష్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడికి భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంచన్‌బాగ్ డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రమేష్ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ.దగ్గరి బంధువు ద్వారా పరిచయమైన వ్యక్తి వ్యాపారం పేరుతో మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకి చెందిన వనం రమేష్‌కుటుంబంతో కలిసి బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌లో నివాసం ఉంటున్నారు. డీఆర్‌డీఎల్‌లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. సమీప బంధువు రాజేష్ ద్వారా మైనింగ్, స్థిరాస్తి వ్యాపారం చేసే వరప్రసాద్ అలియాస్ శివ 2017లో పరిచయమయ్యాడు.
తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని రమేష్‌తో శివ చెప్పాడు. అతని మాటలు నమ్మి మొదట రూ.20 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు సరిపోవడం లేదని చెప్పడంతో బ్యాంక్ లోన్ తీసుకుని మరో రూ.81 లక్షలు ఇచ్చారు. బ్యాంక్ లోన్‌కు సంబంధించి ఈఎంఐ చెల్లిస్తానని శివ మాట ఇచ్చినా అది నిలుపుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బ్యాంకు ఈఎంఐలు ఏడాది వరకు చెల్లించి అక్కడి నుంచి తనకు వీలు కావడం లేదని శివ వాటిని చెల్లించడం ఆపేశాడు. దీంతో రమేష్‌కు బ్యాంక్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. సమస్య పరిష్కారానికి శివ మరో ఇద్దరు వ్యక్తులు రవికుమార్, సుందర్‌ల ద్వారా రమేష్‌తో మాట్లాడించాడు. రమేష్ తీసుకున్న అప్పుకు ఈఎంఐ తాను చెల్లిస్తానని నాదర్‌గుల్‌లో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని' రవికుమార్ రమేష్‌ను కోరాడు.
బ్యాంకు ఈఎంఐ సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో ఆయన అందుకు అంగీకరించారు. 2018లో రవికుమార్ పేరుపై తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అనంతరం ఆ ఇంటిని అమ్మేశానని, ఖాళీ చేయాలని ఇటీవల రవికుమార్ రమేష్‌కు నోటీసులు పంపించాడు. వ్యాపారం పేరుతో రూ.1.1 కోట్లు తీసుకున్నారని, అప్పు చెల్లించడానికి మధ్యవర్తిత్వం వహించడంతోనే ఇల్లు జిపిఏ చేశానని, తాను ఇంటిని ఖాళీ చేయనని రమేష్ అభ్యంతరం తెలిపాడు.
కొన్ని రోజుల తర్వాత అఫ్జల్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇంటిని ఖాళీ చేయాలని రవికుమార్, శివ గొడవ పడ్డారు. శివ తనను నమ్మించి మోసం చేశాడని మనస్తాపం చెందిన రమేష్ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వనం రమేష్‌కు భార్య శిరీష, ఇద్దరు సంతానం ఉన్నారు. స్నేహం పేరుతో అన్యాయంగా తన భర్తను పొట్టన పెట్టుకున్నారని బాధితురాలు వాపోయింది.