Telangana New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ - ఉత్తర్వులు జారీ-dr jitender appointed as telangana dgp ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana New Dgp : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ - ఉత్తర్వులు జారీ

Telangana New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ - ఉత్తర్వులు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 10, 2024 04:33 PM IST

Telangana New DGP Jitender : తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్

Telangana New DGP Jitender : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను… హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.

yearly horoscope entry point

కొత్త డీజీపీ ప్రస్థానమిదే…

పంజాబ్‌కు చెందిన జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. 

నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డిఐజిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్‌లలోనూ జితేందర్ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 2025 సెప్టెంబరులో పదవీ విరమణ చేస్తారు. తాజా నియామకంతో 14 నెలలపాటు డీజీపీగా కొనసాగుతారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి డీజీపీపై ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడక ముందే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి డీజీపీ అంజనీ కుమార్‌ వెళ్లి పుష్పగుచ్చం ఇవ్వడం, శుభాకాంక్షలు చెప్పడంపై ఈసీ తీవ్రంగా పరిగణించింది. అది అధికార దుర్వినియోగమేనని భావించి ఆయనపై వేటు వేసింది. ఏపీ క్యాడర్‌కు కేటాయించిన అంజనీకుమార్ క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలొ కొనసాగారు.

ఈసీ ఆదేశాలతో తెలంగాణ డీజీపీగా రవిగుప్తాకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆయన్నే కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ పాలనపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి డీజీపీ నియామకంపై కసరత్తు చేశారు. చివరకు జితేందర్‌ వైపు మొగ్గు చూపారు.

ఇందులో భాగంగానే జితేందర్ నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు  జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీ హోదాలోనే ఉన్న జితేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

Whats_app_banner