TG Outer Ring Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు కూత! 6 ముఖ్యమైన అంశాలు-dpr ready for construction of hyderabad outer ring rail project 6 key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Outer Ring Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు కూత! 6 ముఖ్యమైన అంశాలు

TG Outer Ring Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు కూత! 6 ముఖ్యమైన అంశాలు

TG Outer Ring Rail Project : హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి. తాజాగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన 6 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

ఔటర్ రింగ్ రైల్

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం.. తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు. దీని నిర్మాణానికి ఇటీవలే చర్యలు ప్రారంభించారు. ఇదే సమయంలో మరో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో.. ఔటర్‌ రింగ్‌ రైల్ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా నిర్మించబోయే రీజినల్‌ రింగ్ రోడ్డుకు అవతల దీన్ని నిర్మించనున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన ఫైనల్‌ లొకేషన్‌ సర్వే పూర్తి చేసిన రైల్వే శాఖ.. దాని అలైన్‌మెంట్, డీపీఆర్‌ తయారీపై కసరత్తు ప్రారంభించింది. జూన్‌ నాటికి డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లైడార్‌ ఆధారిత సర్వే పూర్తి చేసి.. ప్రాథమిక అలైన్‌మెంటును సిద్ధం చేశారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.13,500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

6 ముఖ్యమైన అంశాలు..

1.హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలోకి సరుకు రవాణా రైళ్లు రాకుండా.. వెలుపలి నుంచే వెళ్లిపోయేలా ఔటర్‌ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది.

2.ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు అవతలి వైపు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించేలా.. రైల్వే శాఖ లైడార్‌తో ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది.

3.రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఖరారయ్యాక.. దీని అలైన్‌మెంట్ ఖరారు చేయనున్నారు. ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12.64 కోట్లను గత బడ్జెట్‌లో మంజూరు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

4.ఔటర్‌ రింగ్‌ రైల్ పొడవు 394 నుంచి 420 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. 70 నుంచి 80 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించనున్నారు. భూ సేకరణ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. కేవలం భూసేకరణకే సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

5.ఈ ప్రాజెక్టులో దాదాపు 23 నుంచి 25 వరకు రైల్వేస్టేషన్లు ఉండే అవకాశం ఉంది. కీలక ప్రాంతాల్లో గూడ్స్ రైళ్ల కోసం సరుకు రవాణా యార్డులు నిర్మించనున్నారు.

6.వలిగొండ వద్ద సికింద్రాబాద్‌– గుంటూరు రైల్వేలైన్‌, మాసాయిపేట వద్ద సికింద్రాబాద్‌– నిజామాబాద్‌ లైన్‌, వంగపల్లి వద్ద సికింద్రాబాద్‌ –వరంగల్‌ లైన్‌, గుల్లగూడ వద్ద సికింద్రాబాద్‌– తాండూరు లైన్‌, బాలానగర్‌ వద్ద కాచిగూడ– మహబూబ్‌నగర్‌ లైన్, గజ్వేల్‌ వద్ద సికింద్రాబాద్‌– సిద్దిపేట లైన్‌ను రింగ్‌ రైల్ మార్గం క్రాస్‌ చేస్తుంది.