Double Murders: రంగారెడ్డిలో జంట హత్యలు, అక్కను చంపిన బావపై బామ్మర్ది దాడి, ఎదురుదాడిలో బామ్మర్ది మృతి
Double Murders: రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. మాడ్గుల మండలం నగిల్లా గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన దాడి, ప్రతిదాడిలో ఇద్దరు మృతి చెందారు. పదేళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Double Murders: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. పదేళ్ల క్రితం జరిగిన సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో బావపై బామ్మర్ది దాడి చేయడంతో ఘర్షణ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. మాడ్గుల గ్రామానికి చెందిన యాదయ్య తన భార్యను 2014లో హత్య చేశాడు. ఈ కేసులో జైలుకెళ్లి విడుదలయ్యాడు. ఆదివారం యాదయ్య ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు యాదయ్య బామ్మర్ది శ్రీను హాజరయ్యాడు.
అర్థరాత్రి బావ యాదయ్యపై శ్రీను దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న క్రమంలో యాదయ్య బంధువులు, గ్రామస్తులు శ్రీనుపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో శ్రీను కూడా ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు మాత్రం పరస్పర దాడుల్లో ఇద్దరు చనిపోయారని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీను సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఈ హత్యలు చోటు చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.