Hyderabad Crime : హైదరాబాద్‌లో డబుల్ మర్డర్.. యువతి, యువకుడి దారుణ హత్య?
Hyderabad Crime : హైదరాబాద్‌లోని నార్సింగిలో దారుణం జరిగింది. పద్మనాభస్వామి గుట్టల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఇటు మెదక్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరం నార్సింగ్‌లో డబుల్ మర్డర్ సంచలనంగా మారింది. యువతి, యువకుడి దారుణ హత్యకు గురయ్యారు. యువతి, యువకుడిని దుండగులు బండరాళ్లతో మోది చంపేశారు. పద్మనాభస్వామి గుట్టల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో 10 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించారు డీసీపీ శ్రీనివాస్.
ముగ్గురు అరెస్టు..
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున రోడ్డుపక్కన కనిపించిన మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలు రికార్డు అయినా దృశ్యాల ఆధారంగా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
పండుగ పూట విషాదం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కారులో కాగజ్ నగర్‌కు బయలుదేరారు మెకానికల్ ఇంజనీర్ రాజు, అతడి భార్య. ఈ క్రమంలో అతివేగంతో వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని భార్య మృతిచెందారు. ఘటనా స్థలంలో కారు భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి.
యువకుల మధ్య ఘర్షణ..
ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందాలు నిర్వహించారు. ఇక్కడ యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కోడి పందెం బరి వద్ద బీర్ సీసాలతో కొట్టుకున్నారు. వణుకూరు- పునాదిపాడు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.