2- BHK houses : గ్రేటర్ లో 70 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు - ఆగస్టు నుంచి పంపిణీ-double bedroom houses to be distributed in from next month ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  2- Bhk Houses : గ్రేటర్ లో 70 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు - ఆగస్టు నుంచి పంపిణీ

2- BHK houses : గ్రేటర్ లో 70 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు - ఆగస్టు నుంచి పంపిణీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 20, 2023 02:34 PM IST

Double Bedroom Houses in GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసం ఉంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వచ్చే నెలలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పంపిణి చేసేందుకు సిద్ధమవుతోంది.

డబుల్‌ ఇండ్ల పంపిణీ
డబుల్‌ ఇండ్ల పంపిణీ

2- BHK houses in GHMC:జీహెచ్‌ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించగా... అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటివారం నుంచి జీహెచ్‌ఎంసీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేపడుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం వరకు దాదాపు 70 వేల ఇళ్లను పేదలకు అందిస్తామని చెప్పారు.

ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై బుధవారం అధికారులతో ఆయన సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మరోవైపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ ని సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ రూపొందించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 65 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉంది.

Ts Gruhalakshmi: తెలంగాణలో గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు విధివిధానాలను మరో వారంపది రోజుల్లో ఖరారు చేయనున్నారు.ఎన్నికల షెడ్యూల్ హడావుడి మొదలు కాక ముందే పారదర్శకంగా లబ్దిదారుల్ని ఎంపిక చేసి పథకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. దశల వారీగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.

గృహలక్ష్మి పేరిట ఇప్పటికే సర్కారు నూతన పథకాన్ని ప్రకటించగా, ఆగస్టు నుంచి దానిని అమలు చేయనుంది. గృహలక్ష్మీ పథకానికి సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నియోజక వర్గాల్లో దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ విధానాలను మరో వారంలో ప్రకటించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 4 లక్షల మందిని ఎంపిక చేసి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని గృహలక్ష్మీ మార్గదర్శకాల్లో ప్రకటించారు. ఎంపికైన లబ్ధిదారులకు 3 దశల్లో పథకం ద్వారా మూడు లక్షల సాయాన్ని విడుదల చేస్తారు.

గృహలక్ష్మీ పథకానికి అర్హులను ఎంపిక చేసే క్రమంలో లబ్దిదారులు గతంలో ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. లబ్దిదారుల్లో నియోజక వర్గం యూనిట్‌గా పరిగణిస్తారు. మొత్తంలో మంజూరైన ఇళ్ళలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని సర్కారు స్పష్టం చేసింది. మిగిలిన 20 శాతాన్ని ఆర్థికంగా వెనుక బడిన వారికి ఇస్తారు. విధానాలను ఖరారు చేయడంలో మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖల ఉన్నతాధికారులను భాగస్వాములను చేస్తారు.నెలాఖరులోగా అర్హత ప్రమాణాలను ఖరారు చేస్తారు. జులై నెలాఖరులోగా సంబంధిత మంత్రి స్థాయిలో విధానాలపై చర్చించి ముసాయిదాను సీఎం కేసీఆర్‌కు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.

IPL_Entry_Point