Doublebed Houses: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ట్రబుల్, నెరవేరని నిరుపేదల సొంత ఇంటి కల
Doublebed Houses: నిలువు నీడ లేని నిరుపేదలకు స్వంత ఇంటికళను సాకారం చేసేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ట్రబుల్ గా మారాయి.
Doublebed Houses: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికాక, పూర్తైన ఇళ్ళు లబ్ధిదారులకు పంపిణీ చేయక అలంకార ప్రాయమయ్యాయి. నిరుపేదలు అందులో నివసించక ముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. డబుల్... ట్రబుల్ గా మారి నిరుపేదల స్వంతింటి కళ నెరవేరని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో 25815 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేసింది. అందులో 10 వేల 92 ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యాయి. కానీ కేవలం 1520 ఇళ్ళు మాత్రమే లబ్దిదారులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చోట అనర్హుల పేర్లు జాబితాలో చేర్చి డ్రా తీశారనే విమర్శలు వెల్లువెత్తాయి. మరో 7513 ఇళ్ళ నిర్మాణమే చేపట్టలేదు. నిర్మాణాలు చేపట్టిన చోట చాలా వరకు పిల్లర్లు, స్లాబ్ దశలోనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల చివరి దశ పనుల్లో ఆగిపోయాయి.
కరీంనగర్ సమీపంలోని చింతకుంట శివారులో ఏడు బ్లాకుల్లో ఆరు అంతస్థులతో అపార్ట్మెంట్ టైప్ లో 666 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తికాక బూత్ బంగ్లాలుగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం పాలకుల పర్యవేక్షణ లోపంతో కొన్ని పునాదులకే పరిమితం కాగ, మరికొన్ని పూర్తైన లబ్దిదారులకు అందక నిరూపయోగంగా మారాయి. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు అప్పగించాలని నిరుపేదలతోపాటు వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పేదలతో ఆక్రమిస్తాం- సిపిఎం
అసంపూర్తిగా, నిరూపయోగంగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సిపిఎం నాయకులు సందర్శించి అక్కడి వాస్తవిక పరిస్థితులను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. అందమైన భవనాలు చెత్తాచెదారంతో తాగుబోతులకు అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండడం చూసి అధికారుల తీరు పాలకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై దృష్టి పెట్టి తక్షణమే పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పేదలను సమీకరించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఆక్రమిస్తామని హెచ్చరించారు.
పట్టించుకునేవారే కరువు.…
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పంపిణీ నత్తనడకన సాగడానికి అధికారుల నిర్లక్ష్యం పాలకుల పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు మారిన పట్టించుకునే వారు కానరాక పూర్తయిన ఇళ్ళు నిరూపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
పూర్తయిన ఇళ్లకు కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో పలు చోట్ల పనులు నిలిచిపోగా మరికొన్ని చోట్ల మంజూరై, నిర్మాణం చేపట్టిన ఇళ్ళు తక్కువ, ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక చేయడంలో ఎమ్మెల్యేలు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఏదేమైనా డబ్బుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ట్రబుల్ గా మారి నిరుపేదల పాలిట శాపంగా పరిణమిస్తుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పాలకులు మేల్కొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మనం కోరుకుందాం.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)