Jagtial Donga Mallanna Temple : దొంగ మల్లన్న జాతరకు వేళాయె..! ఈనెల 30 వరకు ఉత్సవాలు
Donga Mallanna Jatara : దేవుడిని భక్తితో కొలుస్తాం... కోరిన కోరికలు తీర్చాలని ఆరాధిస్తాం. కానీ జగిత్యాల జిల్లాలో దేవున్ని దొంగ మల్లన్నగా భావిస్తూ పూజిస్తారు. షష్టి మల్లన్నగా కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగుబంగారంగా ఇలవేల్పుగా విరజిల్లుతున్న దొంగమల్లన్న జాతర ప్రారంభమైంది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో శ్రీమల్లికార్జునస్వామి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దొంగమల్లన్నగా.. షష్టి మల్లన్నగా పూజలు అందుకుంటున్నారు. ఏటా మార్గశిర మాసం శుద్ధపంచమితో మొదలుకొని షష్టిఏడు వారాలపాటు భక్తుల పాలిట ఇలవేల్పుగా విరజిల్లుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉత్తరాన 62 కిలోమీటర్ల దూరంలో.. జగిత్యాల జిల్లాకు తూర్పున 12 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయం ఉంది. ఈనెల 6 నుంచి 30 వరకు ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. భక్తిశ్రద్ధలతో దండివారంతో బోనాలు సమర్పిస్తారు.
జాతర విశిష్టత...
ఆలయంలో ఏటా మార్గశిరమాసం శుద్ధ పంచమి రోజున మల్లికార్జునస్వామి కళ్యాణోత్సవం, దండివారం జాతర, నాగవెల్లితో మహావైభవంగా ప్రారంభమై మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు వరకు షష్టిఏడు వారాలు జాతర సాగుతుంది. స్వామి వారికి ప్రీతికరమైన ఆది, బుధవారాల్లో జాతర భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు మల్లన్నను దర్శించుకుని పట్నాలు వేసి బోనాలు సమర్పిస్తారు.
నేడు స్వామి వారి కళ్యాణం...
డిసెంబర్ 6న రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 7న దండి వారం, 9న సోమవారం నాగవెల్లి (పెద్దపట్నం), అగ్ని గుండాలు, 11నుంచి ప్రతి ఆది, బుధవారాల్లో జాతర ఉంటుంది. చివరి రోజు ఈనెల 30న సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండిహవనం, పూర్ణాహుతితో జాతర ముగుస్తుంది.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు….
దండి వారంతో ఈనెల 30 వరకు జరిగే జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తుంది. జగిత్యాలలోని పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో విక్రమ్, ఫౌండర్ ట్రస్టీ శాంతయ్య తెలిపారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇబ్బందులు ఉండొద్దు - జిల్లా ఎస్పీ
ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది కలగనీయొద్దని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మల్లన్నపేటలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యూలైన్లు, పార్కింగ్ సౌకర్యంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.