Siricilla Street Dogs: సిరిసిల్ల మండలం చిన్నబోనాల గురుకుల పాఠశాలలో కుక్కల దాడిలో ఐదో తరగతి విద్యార్థిని సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. కాలును కుక్క కొరికేయడంతో తీవ్ర గాయం కాగా డాక్టర్ లు 8 కుట్లు వేశారు. హాస్టల్ లో ఉండే విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో విద్యార్థులతోపాటు పేరెంట్స్ భయాందోళన చెందుతున్నారు.
సిరిసిల్ల గురుకుల హాస్టల్‌కు సరైన రక్షణ లేకపోవడంతోనే కుక్కలు పాఠశాల ఆవరణలోకి చొరబడి విద్యార్థిని గాయపర్చాయని విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ వద్ద పిల్లలు పడేసే ఆహారానికి అలవాటు పడ్డ కుక్కలు, పిల్లలపై దాడి చేసినట్లు భావిస్తున్నారు.
సిరిసిల్లలో కుక్కల దాడిలో గాయపడ్డ విద్యార్థినికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన విద్యార్థిని గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతుందని మద్యాహ్నం భోజనం చేసి ప్లేట్ కడుక్కోవడానికి వెళ్తుండగా కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
చిన్నబోనాల గురుకుల పాఠశాలలో విద్యార్థిని సువర్ణపై కుక్కల దాడి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించిన కేటిఆర్, ప్రభుత్వ నిర్లక్ష్యానికి కుక్కల దాడి నిలువెత్తు సాక్ష్యమని విమర్శించారు.
జంతువుల కన్నా క్రూరంగా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చదువుల కేంద్రాలుగా ఉన్న గురుకులాలు రేవంత్ రెడ్డి పాలనలో చావు కేకలు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రత్నాల్లాంటి 85 మంది గురుకుల విద్యార్థులను తెలంగాణ కోల్పోయిందన్నారు. గురుకుల బిడ్డల మరణాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు. ఈ పాపం రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదన్నారు.
తెలంగాణ రైజింగ్ అని సీఎం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత పాలనకు ఇవ్వడం లేదని కేటిఆర్ విమర్శించారు. ప్రకటనల పేరుతో ప్రచారం చేసుకుంటూ పాలను గాలికి వదిలేసి, సొంత డబ్బా కొట్టుకోవడం పై ఉన్న శ్రద్ధ వీసమెత్తైన గురుకులాల విద్యార్థుల భద్రతపై పెట్టాలని సూచించారు. విద్యాశాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేకపోతే చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదన్నారు. గురుకుల బిడ్డల రోదనలే శాపాలై నీతి లేని పాలనకు చరమగీతం పాడుతాయని హెచ్చరించారు.
(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం