Telangana LRS Charges : : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేశారా..? మీ ఛార్జీలను ఇలా చెల్లించుకోండి, ప్రాసెస్ వివరాలివే
Telangana LRS : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్చి 31వ తేదీలోపు క్లియర్ చేసుకునేవారికి 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది ఫీజులను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. అయితే ఈ ఫీజును ఎలా చెల్లించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి....,
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు వస్తున్నారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే మార్చి 31వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది. ఈ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే... రాయితీ నిర్ణయం వర్తింస్తుంది.
మీ దరఖాస్తుకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు వెబ్ సైట్ లో డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డేటా అని కనిపిస్తుంది. అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు.మీ దరఖాస్తుకు అప్రూవ్ వచ్చినట్లు ఉంటే.... ఫీజు వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.... వెబ్ సైట్ లోనే సింపుల్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం లేదా ఇతర మార్గాల ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది ఎలాగో ఇక్కడ చూడండి...
LRS ఫీజును చెల్లించే ప్రాసెస్:
- ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఈ వెబ్ సైట్ లోకి వెళ్లగానే ఆఫీసియల్ లాగిన్, సిటిజన్ లాగిన్ కనిపిస్తుంది. ఇందులో మీరు సిటిజన్ లాగిన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది.ఆ నెంబరును ఎంట్రీ చేయాలి.
- వెరిఫైయిడ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ హోం పేజీలో LRS Plot Fee Payment, LRS Layout Fee Payment ఆప్షన్లు ఉంటాయి. మీరు దేనికైతే దరఖాస్తు చేశారో అందుకు అనుగుణంగా... ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి.
- దీంట్లోనే చివర్లో ఫీజు వివరాల ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ఓపెన్ స్పెస్ ఛార్జీల వివరాలు కనిపిస్తాయి.
- పీడీఎఫ్ పక్కనే Fee Payment అనే ఆప్షన్ కూడా ఉంది. దీనిపై క్లిక్ చేసి మీ క్రమబద్ధీకరణ ఛార్జీలను చెల్లించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటమే కాకుండా... ఇతర మార్గాల ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
- పేమెంట్ ప్రాసెస్ పూర్తి కాగానే మీ చెల్లింపులకు సంబంధించి మరో డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. దీన్ని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా పొందవచ్చు.
- పేమెంట్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవటం మంచింది. ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది.
ఇక రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవటం ద్వారా... చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలపైనా కూడా ఈ రాయితీ లభించనుంది.
రాయితీ నిర్ణయంతో దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో నాలుగో వంతు మినహాయింపు వచ్చినట్లే అవుతుంది. భూముల విలువలు అధికంగా ఉన్న చోట ఇది భారీ ఊరటగానే చెప్పొచ్చు. తాజాగా చేసిన సవరణల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీ (26.08.2020) నాటికి లేఅవుట్‌లో కనీసం పది శాతం ప్లాట్లు విక్రయిస్తే.. మిగతా విక్రయించని ప్లాట్లను కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రస్తుతానికి క్రమబద్ధీకరణ ఫీజు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కూడా ఉంది. మిగతా 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించుకునే వీలు ఉంది.
సంబంధిత కథనం