ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తులను పరిష్కరించే దిశగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని ఇచ్చేందుకు సిద్ధమైంది.
2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లలేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. అయితే అనుకున్నంత వేగంగా ప్రక్రియ ముందుకు సాగలేదు.
తాజాగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై మరో నిర్ణయం తీసుకుంది. 10 శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇవ్వనుంది. నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దే చెల్లింపులు చేసి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది.
ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రభుత్వానికి 25.67 లక్షల దరఖాస్తులు అందాయి. ఇందులో ప్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు కాగా, లేఅవుట్ల దరఖాస్తులు 0.13 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో… ఈ ప్రక్రియలో వేగం పెరిగే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఈ స్కీమ్ కింద లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. వీరంతా కూడా వెయ్యి రూపాయల రుసుంను చెల్లించారు. అయితే చాలా మందికి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియటం లేదు. అయితే ఎల్ఆర్ఎస్ వివరాలను మొబైల్ ద్వారానే సింపుల్ గా తీసుకునే వీలు ఉంది.
సంబంధిత కథనం