Singareni Diwali bonus 2024: సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. రూ.358 కోట్ల బోనస్
Singareni Diwali bonus : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో ఒక్కో ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో రూ. 93,750 జమ కానున్నాయి. శుక్రవారం అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి కార్మికుని ఖాతాలో (శుక్రవారం) రూ. 93,750 జమ అవుతాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం ఆనందంగా ఉందని భట్టి ట్వీట్ చేశారు. బోనస్ ప్రకటించడంపై సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దసరా బోనస్..
ఇటీవలే ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ ఇచ్చింది. ఒక్కో శాశ్వత ఉద్యోగికి సగటున రూ.1.90 లక్షలు జమ అయ్యాయి. బోనస్ కింద తొలిసారిగా ఒప్పంద కార్మికులకూ రూ.5 వేల చొప్పున అందజేశారు. గతేడాది సంస్థ ఉత్పత్తి, గడించిన లాభాల ఆధారంగా దసరా బోనస్‌ను ప్రకటించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలబడి.. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి కార్మికులు. వారి శ్రమ, పోరాట పటిమతో తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక, ప్రత్యేక పాత్ర పోషించారు. అలాంటి సింగరేణి ఉత్పత్తులు, వ్యాపారంలో వచ్చిన లాభాలను కార్మికులకు పంచడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు.. పలు సంస్థలకు, ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తోంది. 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా.. మిగిలినవి రూ.2,412 కోట్లు. ఇందులో మూడో వంతు (33 శాతం) రూ.796 కోట్లను కార్మికులకు బోనస్‌గా ప్రకటిస్తున్నాం' అని దసరా బోనస్ ప్రకటించిన సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
'సింగరేణిలో 41,387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులున్నారు. ఒక్కొక్కరికీ బోనస్ కింద సగటున రూ.1.90 లక్షలు అందించనున్నాం. గతేడాది రూ.1.70 లక్షలు మాత్రమే అందింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున బోనస్‌ను అందజేస్తున్నాం' అని భట్టి స్పష్టం చేశారు.