Delhi Distance: ఢిల్లీకి 300 కి.మీ.తగ్గనున్న దూరం - కర్నూలు-చెన్నై మీదుగా లింక్ రోడ్లు
Delhi Mumbai Expressway: ఢిల్లీ - చెన్నై మధ్య దూరం తగ్గనుంది. దాదాపు 300 కి.మీ మేరకు దూరం తగ్గుతుందని కేంద్రమంత్రి నీతిన్ గడ్కరీ వెల్లడించారు. చెన్నై వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఇది సాధ్యమవుతుందన్నారు.
Delhi-Chennai Expressway : ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే గురించి కీలక అప్డేట్ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన…. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేకి అనుబంధంగా సూరత్ నుంచి చెన్నై వరకు గ్రీన్ ఫిల్డ్ హైవే నిర్మాణం జరుగుతుందన్నారు. ఫలితంగా…. ఢిల్లీ-చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుందని చెప్పారు. సూరత్-సోలాపుర్-కర్నూలు-చెన్నైరహదారి నిర్మాణంతో ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ఇందులో భాగంగా…. సూరత్-నాసిక్-అహ్మద్‌నగర్-సోలాపుర్-కర్నూలు నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చిన్ వరకు రోడ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పనుల ప్రగతి వివరించారు.
సూరత్ నుంచి సోలాపుర్ వరకు రూ.25 వేల కోట్లతో నిర్మిస్తున్న 719 కి.మీ. రహదారి నిర్మాణం 11 శాతం పూర్తయినట్లు గడ్కరీ ప్రకటించారు. సోలాపుర్-కర్నూలు-చెన్నైమధ్య రూ.11వేల కోట్లతో నిర్మిస్తున్న 340 కి.మీ రహదారి పనులు 13 శాతం పూర్తి చేసినట్లు వివరించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… రహదారుల నిర్మాణంలో ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని గడ్కరీ తెలిపారు. ప్రపంచంలో అమెరికా తరవాత అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశంగా భారత్ అవతరించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి దేశంలో…. రోడ్ నెట్‌వర్క్ 91,287 కి.మీ. మేర ఉంటే… ఇవాళ చూస్తే 1,45,240 కి.మీ చేరిందన్నారు. దాదాపు 59 శాతం రోడ్ నెట్ వర్క్ పెరిగిందన్నారు. గతంలో నాలుగు వరసల రహదారులు 18,371 కి.మీ (20%)ఉంటే…. ప్రస్తుతం అది కాస్త 46,657 కి.మీ.కు చేరిందని వెల్లడించారు. 2013-14లో టోల్ ట్యాక్స్ రూ.4,770 కోట్లు ఉండగా…. ప్రస్తుతం రూ.41,342 కోట్లకు చేరిందని చెప్పారు.
ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే అనేది 8 లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. భవిష్యత్తులో దీనిని 12లేన్లుగా విస్తరించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో మొత్తం మీద 15వేల హెక్టార్ల భూమిని తీసుకుని ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూపొందించారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు గాను.. 94 ప్రాంతాల్లో రెస్టారెంట్లతో పాటు వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదారా, సూరత్‌తో కలిపి 40కిపైగా ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై.రోడ్డు మీద ఢిల్లీ నుంచి ముంబైకి ఇప్పుడు 1,424కి.మీల దూరం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే తో. అది 180కి.మీలు తగ్గి 1,242కి.మీలకు చేరుతుంది.ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆటోమేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టెమ్ ఉంటుంది. జంతువులు సురక్షితంగా రోడ్లను దాటేందుకు ఓవర్‌పాస్‌లు, అండర్‌పాస్‌లను కూడా నిర్మించారు. ఇలా చేయడం ఇండియాతో పాటు ఆసియాలోనే తొలిసారి!