తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త వివాదం మొదలైంది. ఏకంగా ఇద్దరు మంత్రులు కేంద్రంగా ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. అయితే తనపై మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని…తప్పును ఒప్పుహకోని క్షమాపణలు చెప్పాలని మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటికొచ్చింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ మా జాతిని మొత్తాన్ని అవమానపరిచాడని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. “నేను మంత్రి కావడం, మా సామజిక వర్గంలో పుట్టడం నా తప్పా…? పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకోని క్షమాపణలు చెప్పాలి. పొన్నం మా జాతిని మొత్తాన్ని అవమాన పరిచాడు.. ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదు. నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు. సహచర మంత్రిని అంత మాట అన్నా వివేక్ చూస్తూ ఊరుకున్నాడు. దీనిపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తాను” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై మల్లికార్జున ఖర్గేతో పాటు మీనాక్షికి కూడా మంత్రి అడ్లూరి లేఖ రాసినట్లు తెలిసింది.
ఇటీవలే మంత్రులు పొన్నం, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే నిర్ణయించిన సమయంలోపే మంత్రులు పొన్నం, వివేక్ అక్కడికి చేరుకున్నారు. సహచర మంత్రిగా ఉన్న లక్ష్మణ్…. సమయానికి రాలేకపోయారు. దీంతో మంత్రి పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ తో మాట్లాడుతూ…కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ వివాదంపై మంత్రి పొన్నం వెంటనే స్పందించారు. నేను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా స్పందించారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనకు ఫోన్ చేసి బాధపడ్డారని కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగానే తాజాగా లక్ష్మణ్ వీడియో కూడా బయటికొచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో మంత్రుల వ్వవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది.
సంబంధిత కథనం