DISCOM Directors: తెలంగాణ డిస్కం డైరెక్టర్లపై వేటు... 11మంది తొలగింపు-dismissal of 11 directors of electricity distribution companies in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Discom Directors: తెలంగాణ డిస్కం డైరెక్టర్లపై వేటు... 11మంది తొలగింపు

DISCOM Directors: తెలంగాణ డిస్కం డైరెక్టర్లపై వేటు... 11మంది తొలగింపు

Sarath chandra.B HT Telugu

DISCOM Directors: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 11మంది డైరెక్టర్లను తొలగిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో డిస్కమ్‌ డైరెక్టర్ల తొలగింపు (Pixabay )

DISCOM Directors: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 11మంది డైరెక్టర్లపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఇంధన శాఖ ము‌ఖ్య కార్యదర్శి రిజ్వీలు ఆదేశాలు ఇచ్చారు.

తెలంగాణలోని ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్లుగా కొనసాగుతున్న 11మంది స్థానంలో కొత్త వారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాన్స్‌కో, జెన్‌‌కోలతో పాటు పంపిణీ సంస్థల్లో కూడా డైరెక్టర్లను తొలగించాలని సిఎండీలను ప్రభుత్వం ఆదేశించింది.

ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో నంబర్ 18,45 ఆదారంగా డైరెక్టర్ల నియామకాలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర డిస్కమ్‌లో పనిచేస్తున్న బి.వెంకటేశ్వరరావు 2013 జులై 31న డైరెక్టర్‌గా నియమించారు. దక్షిణ డిస్కమ్‌లో టి.శ్రీనివాస్‌ను 2013 ఆగష్టు 2న నియమించారు.

వీరి తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియమించిన 9మంది డైరెక్టర్ల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని ప్రభుత్వం గుర్తించింది. డిస్కమ్‌లలో డైరెక్టర్లను రెండేళ్ల పదవి కాలంతో నియమించి ఆ తర్వాత మరో రెండేళ్లు మాత్రమే పొడిగించడానికి అవకాశం ఉంది.

ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్న 11మందిలో 10మంది నాలుగు నుంచి పదేళ్ల సర్వీసులో ఉన్నారు. దీంతో అందరిని తొలగించి కొత్త వారి నియామకం కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. డైరెక్టర్ల తొలగింపు నేపథ్యంలో కరెంటు సరఫరాతో పాటు రోజువారీ విధులకు భంగం కలగకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో దక్షిణ డిస్కమ్‌ పరిధిలోని ఏడుగురు డైరెక్టర్లను సోమవారం సిఎండి ఫారూకీ తొలగించారు.

8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలో ఖాళీగా ఉన్న 8 డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రాన్స్‌కోలో 3, జెన్‌కోలో5 డైరెక్టర్ పోస్టుల్ని భర్తీ చేస్తారు. 62ఏళ్ల లోపు వారు డైరెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం పాతికేళ్ల అనుభవం ఉండాలి. మూడేళ్ల పాటు చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.