Telangana Police : తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్.. పోలీసుల చేతికి మళ్లీ ఆయుధాలు!
Telangana Police : గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. ఈ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. అటు పలు సంఘటనల్లో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పోలీసులకు ఆయుధాలు ఇవ్వనున్నట్టు సమాచారం.
తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. ఇందుకు కారణాలు ఏమైనా.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులకు మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే అంశంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని పోలీస్ శాఖలో చర్చలు జరుగుతున్నాయి.

కారణాలు ఏంటీ..
దాదాపు పదేల్ల కిందట సూర్యాపేట బస్టాండులో సిమీ ఉగ్రవాదులు ఇద్దరు పోలీసులను కాల్చి చంపేశారు. అప్పుడే పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలని భావించారు. కానీ అమలు కాలేదు. ఇటీవల హైదరాబాద్ నగరం అఫ్జల్‌గంజ్ ఘటనతో మళ్లీ అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న సమయంలో.. ప్రభావిత ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఒకవేళ మావోయిస్టులు దాడి చేసినా.. సిబ్బంది ఆయుధాలతో ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నారు.
వీరికి ఆయుధాలు..
గతంలో ఎస్సై, ఆపై స్థాయి అధికారుల వద్ద ఆయుధాలు ఉండేవి. స్టేషన్లలోనూ ఆయుధాలను అందుబాటులో ఉంచేవారు. అయితే.. వామపక్ష తీవ్రవాదం కాస్త తగ్గిన తర్వాత ఈ విధానానికి తెరదించారు. కేవలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆ పైస్థాయి అధికారులకు మాత్రమే పిస్తోలు వంటి ఆయుధాలను ఇచ్చారు. సాయుధ సెంట్రీ పోస్టులను కూడా తీసేశారు. కేవలం వాచ్ పేరుతో.. ఆయుధాలు లేని కానిస్టేబుళ్లే కాపలా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎన్నో ఘటనలు..
తెలంగాణలో మావోయిస్టుల పెద్దగా లేని ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది అందరికీ ఆయుధాలు తొలగించారు. దీంతో ఎన్నో ఘటనలు జరిగాయి. కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 2009, 2010 సంవత్సరాల్లో ఉగ్రవాది వికారుద్దీన్ జరిపిన కాల్పుల్లో.. ఆయుధాలు లేని కారణంగా ఇద్దరు పోలీసులు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
రౌడీషీటర్ కాల్పులు..
2014లో మరో ఘటన జరిగింది. నకిలీ నోట్ల కేసులో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై రౌడీషీటర్ ఎల్లం గౌడ్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ చనిపోయారు. 2015 ఏప్రిల్ 2న సూర్యాపేట బస్టాండ్‌లో అస్లాం, ఎజాజుద్దీన్ అనే ఇద్దరు సిమీ ఉగ్రవాదులు.. కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు కుమ్మరి మహేష్‌లను కాల్చి చంపారు. వారిని వెతుక్కుంటూ వెళ్లిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజులపై కాల్పులు జరిపి చంపేశారు.
తాజా ఘటనతో..
తాజాగా కర్ణాటకలోని బీదర్‌లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులు.. డబ్బు సంచులతో హైదరాబాద్ వచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ వెళ్లేందుకు బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మరోసారి కాల్పులు జరిపారు. ఇటీవల నార్త్ ఇండియా నుంచి తెలంగాణలోకి విచ్చలవిడిగా గన్‌లు రవాణా అవుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు ఉన్నాయి. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పోలీసులకు కూడా ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పోలీస్ శాఖ చర్చ జరుగుతోంది.