SI Suicide Attempt: సిబ్బందితో విభేదాల నేపథ్యంలో మహబూబాబాద్‌లో అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం
SI Suicide Attempt: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఎస్సై ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.
SI Suicide Attempt: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి సమయంలో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేయగా, అపస్మారక స్థితికి చేరుకునే సమయంలో ఆయనే స్వయంగా 108 అంబులెన్స్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు! దీంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా మారడంతో మహబూబాబాద్ నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీను కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట ఎస్సైగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కొత్త చట్టాలపై స్టేషన్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడిన ఆయన కారులో బయటకు వెళ్లి తిరిగి స్టేషన్ కు రాలేదు.
ఆ తరువాత స్టేషన్ సిబ్బంది ఆయనకు కాల్ చేయగా, తన రెండు నెంబర్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో కంగారు పడిపోయిన సిబ్బంది వెంటనే సీఐ జితేందర్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన జిల్లా ఎస్పీకి సమాచారం చేరవేశారు. అనంతరం ఎస్సై మిస్సింగ్ పై సీఐ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.
పురుగుల మందు తాగి అంబులెన్స్ కు ఫోన్
ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లిపోయిన ఎస్సై ఎంతకూ తిరిగి రాకపోవడంతో పోలీస్ అధికారులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా దర్యాప్తులో భాగంగా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో ఆయన ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించినట్లు తెలిసింది.
అనంతరం దర్యాప్తు ముమ్మరం చేయగా, రాత్రి 11.30 గంటల సమయంలో ఎస్సై పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే మహబూబాబాద్ నుంచి ఆయనను వరంగల్ తరలించినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.
అంతర్గత విభేదాలే కారణం?
కొద్ది రోజులుగా స్టేషన్ సిబ్బందికి, ఎస్సై శ్రీరాముల శ్రీనుకు మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు తెలిసింది. ఎస్సై శ్రీనుకు సిబ్బంది సహకరించకపోవడం, ఉన్నతాధికారులకు ఆయన గురించి ఫిర్యాదు చేయడం వల్లే ఆయన గందరగోళంలో పడినట్లు తెలిసింది. అంతేగాకుండా ఐదు నెలలుగా అశ్వరావుపేట ఎస్సైగా పని చేస్తున్న ఆయనపై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ విషయం కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం వల్ల కూడా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే గత వారం నాలుగు రోజుల పాటు సెలవుపై వెళ్లిన ఆయన గత బుధవారమే మళ్లీ విధులు చేరారు. అయినా సిబ్బంది సహకారం లేకపోవడం, ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడం వల్ల ఎస్సై శ్రీను ఆవేదన చెంది ఉంటాడనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎస్సై శ్రీను ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.
ఉదయం తన తల్లితో ఫోన్ లో మాట్లాడాడని, ఆ తరువాత ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారు పడినట్లు తెలిపారు. ఇదిలాఉంటే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై శ్రీను పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)