Maharashtra Election Result : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ రాజకీయాల్లో మంటలు.. టార్గెట్ రేవంత్!
Maharashtra Election Result : మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించింది. ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారు. ఇండియా కూటమి నిరాశలో ఉండగా.. బీజేపీ జోష్‌లో ఉంది. అయితే.. మహా ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ ఓటమికి రేవంత్ కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. ఆశించిన స్థాయిలో ఇండియా కూటమికి సీట్లు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ నిరాశలో ఉంది. అయితే.. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలేనని బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
'మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు. తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా.. మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్ర లో తీవ్ర ప్రభావం చూపెట్టాయి' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన.. కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్రలో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్‌పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరేన్‌కు శుభాకాంక్షలు' అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
'తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం.. తెలంగాణ, కర్ణాటకలో పాలనే. మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించింది. ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని మహా ప్రజలు నమ్మలేదు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుంది' అని బండి సంజయ్ విమర్శించారు.
పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో..
పూణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల మేలు జరిగిందని బీజేపీ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.