KTR ACB Case : కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర చేశారు : బీఆర్ఎస్
KTR ACB Case : కేటీఆర్ ఏసీబీ విచారణ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కుట్రపూరితంగా కేటీఆర్‌పై కేసు పెట్టారని బీఆర్ఎస్ అంటుంటే, ముద్దాయి అన్న సంగతి కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.
ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్‌ను ఏసీబీకి విచారణకు పిలిచింది. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. కానీ.. తన లాయర్‌ను అనుమతించకపోవడంతో.. వెనక్కి వెళ్లారు. ఈ అంశంపై ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
డైవర్షన్ పాలిటిక్స్..
'సీఎం రేవంత్ అన్ని అంశాల్లోనూ బోర్లా పడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కేటీఆర్‌పై కేసు పెట్టారు. కేటీఆర్ ఇంటిపై రెయిడ్ చేసేందుకు కుట్ర చేశారు. బాధ్యత ఉన్న నేతగా కేటీఆర్ విచారణకు వెళ్లారు. లాయర్‌తో విచారణకు హాజరైతే ఏసీబీకి అభ్యంతరమేంటి. పట్నం నరేందర్‌రెడ్డి కేసులో వ్యవహరించినట్టుగానే.. కేటీఆర్ విషయంలోనూ చేయాలని కుట్ర చేశారు' అని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ కౌంటర్..
'ముద్దాయి అన్న సంగతి కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలి. బీఆర్‌ఎస్ హయాంలో లాయర్లకు అనుమతిచ్చారా. ప్రజల కోసం కోట్లాడతాం అంటున్నారు.. ప్రజల తరపున కోట్లాడి దోచుకోమన్నారా.. ప్రజల సొమ్ము తిన్నోళ్లు అరెస్ట్ కావాల్సిందే. జైలుకు వెళ్లాల్సిందే' అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.
మరోసారి నోటీసులు..
అటు విచారణకు వచ్చిన కేటీఆర్.. ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అడ్వొకేట్లను అనుమతించకపోవడంతో.. ఏసీబీ అధికారులకు లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. కోర్టు తీర్పు ఇచ్చే వరకు..విచారణ వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పోలీస్ బందోబస్తు..
కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో.. తెలంగాణ భవన్ దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా-ఈ కార్ కేసులో ఏ1 కేటీఆర్, A2 అరవింద్‌కుమార్, ఏ3 బీఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో.. ఏసీబీ ఆఫీస్‌కు డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ వచ్చారు. ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ.. కేటీఆర్ అధికారుల ఎదుట హాజరు కాలేదు.
ఇబ్బంది ఏంటీ..
'విచారణ పేరుతో ఏసీబీ కార్యాలయానికి నన్ను పిలిచి.. నా ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది..' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 'అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అనడం ఏంటి? దీని వెనుక కుట్ర చేయాలి అనుకోకపోతే.. అడ్వకేట్‌ను ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు అనుమతించలేదు? వస్తే దాని వల్ల మీకు నష్టం ఏమిటి?' అని అడ్వకేట్ సోమ భరత్ కుమార్ అధికారులను ప్రశ్నించారు.