Telangana Assembly : బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. గరం గరంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!-dialogue war between brs and congress mla in telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. గరం గరంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

Telangana Assembly : బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. గరం గరంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ జరుగుతోంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను కోరారు.

అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

మూడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి.. మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ ఉత్సవాల కోసం రూ.2 కోట్లు కేటాయించిందని.. అప్పట్లో మీ పార్టీ ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాకా మీరేం చేశారని ప్రశ్నించారు.

శ్రీధర్ బాబు కౌంటర్..

'2014 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలను నిర్వహించలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది. అనుభవం కలిగిన సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్యాలు మాట్లాడకుండా.. రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నా' అని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

పొన్నం కామెంట్స్..

'మహిళా జర్నలిస్టుల పెట్టిన విడియోను సభ ముందు చూడండి. విచక్షణ కోల్పోయి ఎలా మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అనుభవం కావాలా.. అనుభవం గురించి మాట్లాడుతున్నారు. 14 నెలల్లో మొత్తం అణిచివేతకు గురయ్యాం అంటున్నారు. ప్రజాస్వామ్యం లేదు అంటున్నారు. మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏం చేశాం.. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సొంత పత్రికలు, టీవీ ఏనాడూ పెట్టుకోలేదు. జర్నలిస్టుల మీద విశ్వాసం ఉంది.. మంచిని మంచి అని రాయాలి.. చెడును చెడుగా చూపించాలి. వాడిన భాషను మీరు చూడాలి.. వారికి మద్దతుగా మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి' అని పొన్నం స్పష్టం చేశారు.

పల్లా క్వశ్చన్స్..

'జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లను విడుదల చేయాలి. తెలంగాణ తల్లి సామాన్యంగా ఉండాలని చెప్పే.. వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రం నిండుగా నగలు వేసుకొని ఉంటారు. కాని తెలంగాణ తల్లి మాత్రం సామాన్యంగా ఉండాలని కోరుకుంటారు. తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను వేరు చేయడం అంటే.. తెలంగాణ బతుకును అవమానించినట్టే. పథకాల పేర్లు మార్చడం కాదు.. ప్రజల బ్రతుకులు మార్చండి' అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హితలు పలికారు.

కళాతోరణం కాంట్రవర్సీ..

'తెలంగాణ చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్లం ఆత్మగౌరవం ఉన్నోల్లం. రాణి రుద్రమ దేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమురయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడుతాం. రాజముద్రలో నుండి కాకతీయ కళాతోరణం, చార్మినార్ మార్చవద్దు.. మారిస్తే మళ్లీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం' అని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

స్పీకర్‌కు రిక్వెస్ట్..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం అసెంబ్లీ స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని.. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీష్ రెడ్డి వివరణ తీసుకోకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించారు. సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.