Kondagattu Temple : కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు - తరలివస్తున్న భక్తజనం
Kondagattu Anjaneya Swamy Temple : కొండగట్టులో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో… తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు తరలివస్తున్నారు.
Hanauman Jayanti Celebrations in Kondagattu 2024 : కోరిన కోర్కెలు తీర్చి కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా నిలిచే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిది పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
మూడు రోజుల పాటు జరిగే వేడుకలు గురువారం ప్రారంభం కాగ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరపున ఆంజనేయస్వామికి పట్టు పస్త్రాలు ఆలయ అధికారులు సమర్పించారు. రెండు రోజుల్లోనే రెండు లక్షల మంది హనుమాన్ దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకుని మాల విరమణ చేశారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారి కాషాయవర్ణాన్ని తలపిస్తుంది.
కొండంత భక్తిపారవశ్యంతో హనుమాన్ జపం... రామనామస్మరణతో మారుమ్రోగుతుంది. హనుమంతుడు జన్మించిన వైశాఖ మాసం బహుళ దశమి శనివారం రోజు కావడంతో ఈసారి జయంతికి రెండు రోజుల ముందు నుంచే భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో ఆలయంలో ఆర్జిత సేవలన్ని రద్దు చేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
దారులన్ని కొండగట్టు వైపే...
హనుమాన్ జయంతి సందర్బంగా భారీగా తరలివస్తున్న భక్తులతో దారులన్ని కొండగట్టు వైపే అన్నట్లు సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక చత్తీస్గడ్ నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మండే వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండ భక్తిపారవశ్యంతో సుదూర ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్ష స్వాములు పాదయాత్రతో కొందరు, వాహనాల్లో మరికొందరు తరలివస్తుండడంతో కొండగట్టుకు చేరే కరీంనగర్ రూట్ లో, జగిత్యాల రూట్ లో పలు చోట్ల చలివేంద్రాలు మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి కొండపై కాళ్ళు కాలకుండా కార్పెట్ లు చేశారు. వాహనాల పార్కింగ్ కు ఆరు చోట్ల ఏర్పాటు చేసి భక్తులను ఆలయ సన్నిది వద్దకు చేర్చేందుకు ప్రీ ఆర్టీసి మినీ బస్సులు ఏర్పాటు చేశారు. మాల విరమణ చేసే హనుమాన్ దీక్ష స్వాముల కోసం 300 మంది అర్చకులను ఏర్పాటు చేశారు. పెద్ద హనుమాన్ జయంతికి మూడు లక్షలకు పైగా మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశామని, ఎంత మంది వచ్చినా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
శనివారం హనుమాన్ జయంతి ప్రత్యేకత
హనుమాన్ జయంతికి కొండగట్టుకు ప్రత్యేకత ఉంది. విశ్వవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఒక్కసారి జరుపుతుండగా కొండగట్టులో రెండు సార్లు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. చైత్రమాసం ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి, వైశాఖ మాసం బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు.
పెద్ద హనుమాన్ జయంతే అత్యంత ప్రవిత్రమయ్యిందని శనివారంతో కూడిన వైశాఖమాసం బహుళ దశమి నాడు జయంతి రావడం ప్రాధాన్యత సంతరించుకుందని ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, కపిందర్ శర్మ తెలిపారు. హనుమాన్ జయంతి రోజున కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే దుష్టశక్తులు పోయి ఎంతో పుణ్యఫలం, బద్ది బలం లభిస్తుందని చెప్పారు.
మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో బాగంగా ఉత్సవమూర్తులను యాగయాలకు తరలించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. శనివారం హనుమాన్ జయంతి సందర్బంగా ఉదయం పంచామృతాలతో అబిషేకం సాయంత్రం పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.
కొండగట్టును అభివృద్ది చేస్తాం - అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హనుమాన్ జయంతి సందర్బంగా కొండగట్టు ఆంజనేయస్వామిని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి రోజుల విఐపిల తాకిడితో భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ముందు రోజు స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.
ఎండలు మండిపోతున్న తరుణంలో కొండగట్టుకు వచ్చే హనుమాన్ భక్తులు ఇబ్బంది పడకుండా విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాబోయే రోజులు శాశ్వతంగా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. అంజన్న ఆశీస్సులతో ప్రభుత్వ సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు.